వైసీపీకి బాలయ్య అల్లుడి సీరియస్ వార్నింగ్..! రీజన్ ఇదే..!
ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ కు విపక్ష వైసీపీపై ఒక్కసారిగా కోపం వచ్చింది. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆటంకాలు కల్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నగరంలో జరుగుతున్న ఈ కీలక సదస్సును సక్సెస్ చేసేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్న శ్రీభరత్ కు ఆగ్రహం తెప్పించిందేంటో ఓసారి చూద్దాం..
రాష్ట్రంలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో విశాఖలోనూ నిరసనలకు దిగుతోంది. ర్యాలీలు చేపడుతోంది. ఓవైపు సీఐఐ భాగస్వామ్య సదస్సును సక్సెస్ చేయడం ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం సాధించాలని కూటమి పార్టీలన్నీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీ ర్యాలీలు వారిని చికాకుపెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ ఇవాళ వైసీపీని ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని శ్రీభరత్ విమర్శించారు. అభివృద్ధి అంటే వైసీపీ నేతలకు తెలియదన్నారు. ఏపీ విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్‌డీ చేశారన్నారు. ప్రపంచస్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో వైసీపీ ర్యాలీలు చేయడం దురదృష్ట కరమని ఎంపీ తెలిపారు.

ఏపీకి మంచి చేయాలని చూస్తే తమ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైసీపీ నేతలపై విశాఖ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, లేక స్వార్ధ ప్రయోజనాలు ముఖ్యమా అన్నది ప్రజలు ఆలోచించాలని సూచించారు. చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని వైసీపీ నేతలకు ఎంపీ హెచ్చరికలు చేశారు. వైసీపీ నేతలు ర్యాలీలు చేయాలనుకుంటే మరో సమయంలో చేసుకోవాలని సలహా ఇచ్చారు. ర్యాలీల పేరుతో సదస్సును డైవర్ట్ చేద్దామని, విశాఖకు చెడ్డ పేరు తెద్దామని చూస్తే ప్రభుత్వం తరఫున ముందుకెళ్తామని భరత్ వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications