వాళ్లకంటే పెద్ద మోసగాళ్లు: మోడీపై టీడీపీ, బీజేపీని మరోసారి ఏకేసిన గల్లా జయదేవ్
Recommended Video

న్యూఢిల్లీ: రాజ్యసభలో విభజన హామీలపై చర్చించాలని టీడీపీ ఎంపీలు చైర్మన్ వెంకయ్య నాయుడుకు గురువారం నోటీసులు ఇచ్చారు. అంతకుముందు టీడీపీ సభ్యులు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విభజన హామీలు అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం సాగిస్తామని వారు చెప్పారు.
ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. రెండు సభల్లోను టీడీపీ సభ్యులు నిరసన కొనసాగించారు. మరోవైపు, విభజన హామీలపై చర్చకు లోకసభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. లోకసభలో వెల్లోకి వెళ్లి సభ్యులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో లోకసభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి.
చదవండి: ఏపీ అంటే లెక్కలేదా, చిదంబరం వల్లే: మోడీకి బాబు మరో షాక్, బంద్‌పై యూటర్న్, కానీ

వారి కంటే పెద్ద మోసగాళ్లు
టీడీపీ ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, కేశినేని నాని, సీఎం రమేష్ తదితరులు బీజేపీపై నిప్పులు చెరిగారు. తమ ఆందోళన సభలో కొనసాగిస్తామని చెప్పారు. కాంగ్రెస్ కంటే బీజేపీ పెద్ద మొసం చేసిందని, వారి కంటే పెద్ద మోసగాళ్లు వీరు అన్నారు. కాంగ్రెస్ తలుపులు వేసి అన్యాయం చేస్తే, వీళ్లు తలుపులు తెరిచి మోసం చేశారని రాయపాటి ధ్వజమెత్తారు. బాహుబలి కంటే ఏపీకి తక్కువ ఇచ్చారని గల్లా జయదేవ్ మరోసారి అన్నారు.

బాహుబలి కలెక్షన్స్ కంటే తక్కువ
కాగా, అంతకుముందు రోజు గల్లా జయదేవ్ లోకసభలో బీజేపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మోడీ ఇంకెన్నిసార్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. అందర్ని, అన్నిసార్లు మోసం చేయలేరన్నారు. ఆంధ్రులు ఫూల్స్ కాదని దుయ్యబట్టారు. మీరిచ్చిన నిధులు బాహుబలి కలెక్షన్స్ కంటే తక్కువ అన్నారు.

బీజేపీని కడిగేసిన గల్లా
మా కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు నమ్మదగిన మిత్రపక్షమా అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ గతే మీరు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవని ఏపీకి నిధులు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. హామీలపై ప్రధాని, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే మీరు దురుద్దేశ్యంతో ఉన్నట్లే అన్నారు. మీతో బంధంపై మేం ఆలోచించక తప్పదన్నారు.

బీజేపీకి హెచ్చరిక
టీడీపీని బలహీనపరచడం ద్వారా బీజేపీ బలపడవచ్చని మీకు మీ పార్టీ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చని, వాటిని మీరు నమ్మితే మొదటికే మోసం వస్తుందని గల్లా జయదేవ్ అన్నారు. ఏపీ ప్రజలను మోసగించడం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందవచ్చని కాంగ్రెస్ పార్టీ భావించిందని, ఇదే సమయంలో వైసీపీతో జట్టు కట్టి ఏపీలోనూ లాభం పొందవచ్చని అంచనా వేసిందని, కానీ, ఆ పార్టీ ఏపీలో భూస్థాపితం అయిందన్నారు. ఇలాంటి వ్యూహాలనే అమలు చేయాలని భావిస్తే, బీజేపీకి కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. తప్పుడు వ్యూహాలను పాటిస్తే బీజేపీకి భంగపాటు తప్పదన్నారు.












Click it and Unblock the Notifications