పట్టు బిగిస్తున్న పవన్ - ఢిల్లీ బిగ్ గేమ్, టీడీపీ అలర్ట్..!!
జమిలి ఎన్నికల వేళ ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి పొత్తు కొనసాగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇదే ఇప్పుడు పవన్ కు వరంగా మారుతోంది. బీజేపీ సైతం ఏపీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. గతం కంటే భిన్నంగా ఏపీకి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పొత్తులో ఉంటూనే పవన్, బీజేపీ రాష్ట్రంలో బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తున్నాయి. పవన్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఢిల్లీ కేంద్రంగా బిగ్ గేమ్ నడుస్తోంది. దీంతో, టీడీపీ అలర్ట్ అయింది.
మారుతున్న రాజకీయం
జమిలి ఎన్నికల దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. దీంతో, పాలనా వ్యవహారాలతో పాటుగా సంక్షేమ పథకాల అమలు పై చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక..కూటమికి ప్రధాన రాజకీయ ప్రత్యర్దిగా ఉన్న జగన్ పైన గురి పెట్టారు. నాలుగు వైపులా ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాల ను అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మూడు పార్టీల పొత్తు కొనసాగాలని.. మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు పదే పదే సూచిస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

పవన్ పక్కా ప్లాన్
టీడీపీ ప్రధాన పార్టీగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోంది. చంద్రబాబు కు పవన్ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నాయకత్వంతోనూ సత్సంబంధాలు నడుపుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. టీడీపీ నుంచి క్షేత్ర స్థాయిలో తమ పార్టీ కేడర్ ఇబ్బందుల పైన ఫిర్యాదులు వచ్చినా పవన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు రాజకీయంగా చేసే విమర్శల్లో పవన్ జోక్యం చేసుకోవటం లేదు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. కానీ, క్రెడిట్ దక్కే అంశాల్లో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన మద్దతు లేకుండా టీడీపీ ఒంటరిగా ముందుకు వెళ్తే అవకాశం లేకుండా పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు.
ఎవరి లెక్కలు వారివే
ఇటు సాధారణ జనంలోనూ పవన్ వద్దకు వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయనే పాజిటివ్ అభిప్రాయం కలిగించటంలో జనసేనాని సక్సెస్ అయ్యారు. ఏపీలో పవన్ బలాలు - బలహీనతల పైన పూర్తి అవగాహన ఉన్న బీజేపీ ఏపీలో తమ భవిష్యత్ కోసం ఆచితూచి వ్యవహరిస్తోంది. పవన్ తో భవిష్యత్ బంధం మరింత బలంగా ఉండాలని కోరుకుంటోంది. ఏపీలో భవిష్యత్ రాజకీయం కోసం ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాష్ట్ర అవసరాలకు సానుకూలంగా స్పందిస్తోంది. అయితే, చంద్రబాబు కోరుకుంటున్నట్లుగా కూటమిగా కొనసాగటానికి పవన్ కు అభ్యంతరం లేకపోయినా .. మరో విడత కూడా డిప్యూటీ సీఎంగానే ఉండాలంటే అందుకు పవన్ అంగీకరిస్తారా అనేది అసలు అంశంగా మారుతోంది. ఎన్నికల నాటికి ప్రజానాడికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని.. అప్పటి వరకు పవన్ -బీజేపీ తమ ఎదుగుదల దిశగా ఆలోచన చేస్తున్నారు. ఢిల్లీ ఆలోచన అర్దం చేసుకున్న టీడీపీ అప్రమత్తం అయింది. దీంతో, జమిలి పైన స్పష్టత వస్తే రాష్ట్ర రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications