పవన్‌పై టీడీపీ ఆచీతూచీ : నెగటివ్‌గా తీసుకోవద్దంటున్న లోకేష్
విజయవాడ : 'పవన్ కళ్యాణ్ బాగానే చెప్పారు'.. గతంలో కాకినాడ, తిరుపతి సభల్లో ప్రత్యేక హోదాపై పవన్ ప్రసంగించిన తీరుపై సీఎం చంద్రబాబు స్పందించిన తీరు ఇది. ఇక నిన్నటి అనంత సభ పట్ల కూడా ఎక్కడా వ్యతిరేకత బయటపడకుండా జాగ్రత్తపడాలన్న యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అనంతపురం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను నెగెటివ్ గా తీసుకోవద్దని, సానుకూలంగా తీసుకోవాలని టీడీపీ నేతలకు సూచించారాయన. ఓ బాధ్యతగల వ్యక్తిగా పవన్ సూచనలు చేశారని, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుందామని పార్టీ నేతలతో పేర్కొన్నారు.
ప్రత్యేక హోదాకు అవకాశం ఏమాత్రం లేదన్న విషయాన్ని నిర్దారించుకున్న తర్వాతే.. ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించామని తెలిపారు. ప్యాకేజీకి కూడా చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా కోరుతున్నారని గుర్తు చేశారు. నిన్న రాత్రి విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. పవన్ పై వ్యతిరేకత ప్రదర్శించడం కన్నా.. ఆచీ తూచీ వ్యవహరించడం మేలు అన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు స్పష్టమవుతోంది. అనంతపురం నుంచి జనసేన మరింత యాక్టివ్ అవుతుండడం.. వచ్చే ఎన్నికల్లో పవన్ రంగంలోకి దిగితే.. దాని ప్రభావం టీడీపీపై ఖచ్చితంగా ఉండే అవకాశం ఉండడంతో.. పవన్ పై ఇప్పటికిప్పుడు వ్యతిరేకత చాటుకుంటే అది టీడీపీకే చేటు చేస్తుందనే యోచనలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి ప్రత్యేక హోదా పోరాటాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలని పవన్ భావిస్తున్న సంగతి నిన్నటితో తేట తెల్లమైంది. దీంతో భవిష్యత్తులో పవన్ ను టీడీపీ ఎలా ఎదుర్కోబోతున్నది? అన్న అంశం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications