ఎమ్మెల్సీ ఫలితాలు, వైసీపీ సస్పెన్షన్లతో మారిన పొలిటికల్ సీన్- టీడీపీ తాజా వ్యూహాలివే..?
అమరావతి : ఏపీలో నాలుగేళ్ల వైసీపీ పాలన తర్వాత వచ్చే ఎన్నికలపై భారీ ఆశల్లేకపోయినా పోరాటం కొనసాగిస్తున్న టీడీపీకి ఎమ్మెల్సీ ఫలితాలు భారీ ఊరటనిచ్చాయి. ఏమాత్రం ఆశల్లేని పరిస్ధితుల నుంచి ఏకంగా నాలుగు ఎమ్మెల్సీ సీట్లు సొంతం చేసుకోవడం, అనంతరం వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడం.. ఇలా ప్రతీదీ ఇప్పుడు చంద్రబాబులో సంతోషాన్ని నింపుతోంది. ఇదే ఊపును కొనసాగించేందుకు వీలుగా అన్ని వ్యూహాలకు ఆయన ఇప్పుడు పదునుపెడుతున్నారు.
ఎమ్మెల్సీ ఫలితాల నేపథ్యంలో టీడీపీకి రెండు శుభవార్తలు అందాయి. వాటిలో ఒకటి వైసీపీ తమ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే, మరొకటి గతంలో తమ పార్టీని వీడి వైసీపీకి మద్దతిచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరిగి పార్టీవైపు చూస్తుండటం సానుకూలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ రెండు అంశాలపై ఆచితూచి నిర్ణయం తీసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపణలు చేస్తున్నతరుణంలో వెంటనే ఆ నలుగురిని తమ పార్టీలో చేర్చుకుంటే విమర్శలు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దానికి బదులు వారితోనే మైండ్ గేమ్ మొదలుపెట్టించేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత గతంలో తమ పార్టీని వీడి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్,కరణం బలరాంలో ఇద్దరు లేదా ముగ్గురు తమవైపు చూస్తున్నట్లు టీడీపీ గుర్తించింది. ఇప్పటికే వారితో టచ్ లోకి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో వంశీ మినహా మిగతా ముగ్గురిని తిరిగి చేర్చుకునే విషయంలో టీడీపీకి ఎలాంటి అభ్యంతరాలు లేనట్లు కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో వారిని తిరిగి చేర్చుకుంటే వచ్చే ఇబ్బందులేవీ లేవు. కాబట్టి ఆ మేరకు ఆయా ఎమ్మెల్యేలకు టీడీపీలోకి తిరిగి వచ్చేందుకు ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications