అన్నీ చూస్తూనే ఉన్నారుగా.. మీరే తేల్చుకోండి? ప్రత్యేకంగా చెప్పాలా?
ఈ ఏడాది ఏప్రిల్, మేలోకానీ, లేదంటే నవంబరు, డిసెంబరులోకానీ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు అంచనా వేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే పట్టుదలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనపడకపోవడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంలోనైనా ముందస్తుకు వెళ్లవచ్చని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ పేరుతో జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలోనే ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి శ్రేణులను సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించేవారు.

చంద్రబాబు అంచనా
ఈ ఏడాది ఏప్రిల్, మేలోకానీ, లేదంటే నవంబరు, డిసెంబరులోకానీ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు అంచనా వేస్తున్నారు. తాను ఏ నెలలో జరుగుతాయో కూడా చెప్పానని, దాన్నిబట్టి ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని, టీడీపీ శ్రేణులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రధానంగా మూడు అంశాలు ముందస్తుకు కారణమవుతాయనేది చంద్రబాబునాయుడి అంచనా. వివేకానందరెడ్డి హత్య కేసు, రాష్ట్రానికి అప్పులు పెరగడం, ఆర్థిక పరిస్థితి దిగజారడంవల్లే ముందస్తు వస్తుందని చెబుతున్నారు.

చంద్రబాబు విశ్లేషణ
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు శ్రేణులను సిద్ధం చేసేలా ఈనెల 21వ తేదీ నుంచి 5 రోజులపాటు పోల్ మేనేజ్ మెంట్ పై కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముందస్తు ఎన్నికల అంశాన్ని పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు. ముందస్తు ఎన్నికలకు దారితీసే పరిణామాలను విశ్లేషించారు.

ఎంత సీనియర్ అయినా సరే..
సాధారణ ఎన్నికలు వచ్చేలోగా వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులెవరనేది తేలుతుందని, మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త అప్పులకు అంగీకారం తెలిపితే రెండు నెలల సమయంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నారని చంద్రబాబు విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, టికెట్లతో సంబంధం లేకుండా ఎవరికి టికెటిచ్చినా పార్టీ కోసమే పనిచేయాలని సూచించారు. పార్టీ గెలిస్తే అధికారం అందరికీ వస్తుంది.. ఇప్పుడు ఉన్న ఇబ్బందులు అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి మీరే తేల్చుకోండని ఘాటుగానే నాయకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అధిష్టానాన్ని ధిక్కరిస్తే ఎంత సీనియర్ నేతనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications