గుంటూరు లాడ్జిసెంటర్ లో తీవ్ర ఉద్రిక్తత!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను నిరసిస్తూ.. టీడీపీ, జనసేనతోపాటు ప్రజాసంఘాలు తలపెట్టిన ధర్మాగ్రహ శాంతి ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ర్యాలీ జరగకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతోపాటు బలగాలను భారీగా మొహరించారు. అయినప్పటికీ వారంతా ర్యాలీని నిర్వహించారు. పార్టీ నేతలు నక్కా ఆనంద్ బాబు, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీదర్, జనసేన నాయకుడు శ్రీనివాస్ యాదవ్, మహిళలు, రైతులు పాల్గొన్నారు.
లాడ్జి సెంటర్ కు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. లాడ్జి సెంటర్ నుంచి అరండల్ పేట వరకు దాదాపు 800 మంది పోలీసులు పహారా కాశారు. లాడ్జి సెంటర్ నుంచి మార్కెట్ వద్ద హిమని సెంటర్ వరకు శాంతి ర్యాలీ చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలోనే ఎస్పీని కలిసి అనుమతి కోరారు. దీనిపై గుంటూరు పశ్చిమ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి స్పందించారు.

ర్యాలీకి ప్రభుత్వ పరంగా, పోలీసుల పరంగా అనుమతి లేదని నిన్నే ఒక ప్రకటన విడుదల చేశారు. 31 యాక్ట్ తోపాటు 144 సెక్షన్ అమల్లో ఉందని, ర్యాలీలు, సభలు జరపకూడదని తేల్చిచెప్పారు. ర్యాలీకి రావద్దంటూ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు నోటీసులు ఇచ్చారు. పోలీసులు ముందస్తు అరెస్ట్ ల నుంచి తప్పించుకునేందుకు టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా గృహ నిర్బంధం చేశారు.












Click it and Unblock the Notifications