TDP: అడుసు తొక్కనేల.. కాలు కడగనేల?
TDP నాయకుల తొందరపాటుతనంతో పార్టీ పరువే పోతోందని సీనియర్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీని వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. పార్టీ నాయకులు చేస్తున్న పనులతో టీడీపీయే ఇబ్బందులు పడుతోంది. కొద్దిరోజుల క్రితం గన్నవరంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం జరిగింది. ఈ సందర్భంలో పోలీసులు పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిని అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను పోలీసులు కొట్టారంటూ పట్టాభి తలకు ముసుగు వేసి కుమ్మేశారంటూ ప్రచారం చేయడమే కాదు.. మీడియాకు ఫొటోలు కూడా విడుదల చేశారు.
పార్టీ నుంచి అధికారికంగా వచ్చాయి కాబట్టి అవి కూడా పట్టాభిని కొట్టిన ఫొటోలేనని భావించిన మీడియా వాటిని ఉపయోగించింది. ఆ ఫొటోల్లో పట్టాభి మోకాళ్లు వాచిపోయి ఉన్నాయి. ఈ విషయంలో ఏపీ పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇంతగా కొడతారా? అంటూ నెటిజన్లు కూడా ఫైరయ్యారు. అయితే ఆ ఫొటోలు పాతవి కావడం, ఏడాది కిందటి ఫొటోలు కావడంతో తప్పు జరిగిందంటూ టీడీపీ నాయకులు చిన్న వివరణ ఇచ్చారు. కానీ అధికార పక్షం తెలుగుదేశం పార్టీని ఆటాడుకుంది.

తాజాగా మరోసారి ఆ పార్టీ నాయకులు తప్పు చేశారు. అసెంబ్లీ ప్రోటోకాల్ విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ముందుగా గవర్నర్ రావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చేంతవరకు స్పీకర్ ఛాంబర్ లో ఎదురుచూశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఒక ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్ గా వచ్చింది. అయితే అది అవాస్తవమని ప్రభుత్వం ఖండించింది. గవర్నర్ కంటే ముఖ్యమంత్రే ముందుగా వచ్చారంటూ ప్రభుత్వం ఆడియో క్లిప్స్ తో సహా నిరూపించింది. గవర్నర్ రాక కోసం ముఖ్యమంత్రి ఎదురుచూసిన విషయాన్ని ఆధారాలతో సహా అధికార పార్టీ నిరూపించగలిగింది.
కీలకమైన అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి ఇంత తేలిగ్గా ఎలా వ్యవహరిస్తారంటూ సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో కూడా అధికార పార్టీ నేతలు టీడీపీ నాయకుల్ని, పార్టీని మరోసారి ఆటాడుకున్నారు. తొందరపాటుతో వచ్చే ఇబ్బందులే ఇవని, తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చేలా చేయడంలో టీడీపీ నాయకులే ముందుంటున్నారని, ఈ రెండు సంఘటలన నుంచి నేర్చుకున్న పాటంతో భవిష్యత్తులోనైనా సరిగా వ్యవహరించాలంటూ సొంత పార్టీ నుంచే విమర్శలు, సూచనలు, సలహాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications