సీఎం జగన్ కంచుకోటలో టీడీపీ సైలెంట్ ఆపరేషన్..!!
ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా కుప్పం పైన ఫోకస్ పెట్టారు. అదే సమయంలో చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులను లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడ ఈ సారి సీఎం జగన్ సంబంధీకులనే టీడీపీ నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా సీఎం జగన్ సొంత జిల్లాలొ వైసీపీ పైన మానసికంగా పై చేయి సాధించటంతో పాటుగా ఎన్నికల్లో లబ్ది పొందే వ్యూహాలు చేస్తున్నారు.

జగన్ ఇలాకాలో టీడీపీ కొత్త వ్యూహాలు
ఇప్పుడు అధికార వైసీపీ - టీడీపీ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు పార్టీల భవిష్యత్ కు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. దీంతో.. రాజకీయంతో పాటుగా మైండ్ గేమ్ తీవ్రతరం చేస్తున్నారు. అందులో భాగంగా సీఎం జగన్ ప్రతీ సభలో..పార్టీ సమీక్షల్లో కుప్పంలోనూ వైసీపీ గెలవబోతోందంటూ పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు కడప జిల్లాలో అందులో పులివెందుల పైన టీడీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దీని కోసం ఇప్పటికే వైఎస్ వివేకా హత్య తరువాత చోటు చేసుకున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ వివేకా కుమార్తె సునీతను టీడీపీ నుంచి బరిలోకి దింపాలనేది అసలు లక్ష్యంగా. ఇప్పటికే ఈ మేరకు ప్రాధమికంగా సునీతను ఒప్పించేందుకు చర్చలు జరిగాయని విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు నిర్ధారిస్తున్నారు.

కడపలో మొహరించిన రాబిన్ టీం
దీంతో..కడప జిల్లాలో టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ టీం రంగంలోకి దిగింది. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపైన క్షేత్ర స్థాయిలో ఆరా తీస్తోంది. పులివెందులలో ప్రస్తుం ఇంఛార్జ్ గా ఉన్న బీటెక్ రవి అభ్యర్ధిత్వంతో పాటుగా..సునీతను ఒప్పించి అభ్యర్ధిగా బరిలోకి దింపితే నియోజకవర్గంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందనే అంశం పైన ఆరా తీస్తున్నారు. సునీత నేరుగా సీఎం జగన్ పైన పోటీకి అంగీకరించకపోతే, కడప ఎంపీగా బరిలోకి దించేలా టీడీపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయ వ్యూహం సిద్దం చేసిందని విశ్వసనీయ సమాచారం. అయితే, ఇప్పటి వరకు సునీత ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నా..టీడీపీ ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఇక, ఇప్పుడు నేరుగా పులివెందులో సునీత కు మద్దతు ఏ స్థాయిలో ఉందో ఆరా తీస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో సర్వే.. కీలక నిర్ణయాల దిశగా
వైఎస్ వివేకాకు నియోజకవర్గంలో ఉన్న పట్టు..హత్యతో వచ్చిన సానుభూతి తమకు అనుకూలంగా మలచుకొనే వ్యూహం టీడీపీ అమలు చేస్తోంది. ఇక, కడప జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ, ఈ సారి జిల్లాలో టీడీపీకి అనుకూలంగా మారుతున్న నియోజకవర్గాల పైన రాబిన్ టీం ఫోకస్ పెట్టింది. జిల్లాలో సీఎం జగన్ కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టును సడలించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల పైన క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. అదే విధంగా ఆ జిల్లాలో జగన్ కు కలిసి వస్తున్న అంశాల పైన ఆరా తీస్తున్నారు. రెండు రోజులుగా కడప జిల్లా కేంద్రంగా రాబిన్ శర్మ టీం చేస్తున్న ఆపరేషన్ పైన తుది నివేదిక సిద్దం అయిన తరువాత జిల్లాలో పార్టీ పరంగా కొత్త నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications