ముర్ముకు టీడీపీ మద్దతు - యశ్వంత్ సిన్హా కీలక వ్యాఖ్యలు : రెండు సార్లు సమావేశమైనా..!!
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటించింది. ముర్ము ఏపిలో ప్రచారానికి వస్తున్న వేళ..టీడీపీ వ్యూహాత్మకంగా తమ నిర్ణయానికి వెల్లడించింది. ముర్ముకు వైసీపీ మద్దతు ఇవ్వటంతో పాటుగా నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొంది. ఏపీకి ముర్ము వచ్చిన సమయంలో వైసీపీ - బీజేపీ నేతలు స్వగతం పలకటంతో పాటుగా సీఎం జగన్ తన నివాసంలో తేనేటి విందు ఇచ్చారు. ఇక, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం సీఎం జగన్ పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలను పరిచయం చేసారు. ఏ ఒక్క ఓటు పొరపాటు లేకుండా వేయాలని..ముర్మును గెలిపించాలని పిలుపునిచ్చారు.

చివరి నిమిషంలో టీడీపీ నిర్ణయం
ఇక, ముర్ముకు మద్దతిచ్చిన టీడీపీ..ప్రత్యేకంగా విజయవాడలోని ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత చంద్రబాబు గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన ప్రధాని మోదీని అభినందిస్తూనే.. ముర్ముకు మద్దతుగా పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలు ఓటు వేయాలని సూచించారు. దీని పైన రాష్ట్రపతి అభ్యర్దిగా జాతీయ స్థాయిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా స్పందించారు. ముర్ముకు టీడీపీ మద్దతు ఇవ్వటం తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు.

యశ్వంత్ సిన్హా స్పందన
రాష్ట్రపతి ఎన్నిక పైన ఢిల్లీలో రెండు సార్లు సమావేశమైనా..టీడీపీని ఎందుకు పిలవలేదో తనకు తెలయదని చెప్పుకొచ్చారు. అయితే, టీడీపీ తీసుకున్న నిర్ణయంతో ఏపీలోని మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ముర్ముకు మద్దతుగా మారాయి. ఏపీలో బీజేపీకి ఒక్క ఓటు లేకపోయినా..రాష్ట్రంలోని మొత్తం ఓట్లు ముర్ముుకు మద్దతుగా పోలవ్వనున్నాయి. వైసీపీని తాము అడగకపోయినా..ముందుకొచ్చి మద్దతు ప్రకటించిందని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేసినా, ముఖ్య నేతలు మాత్రం తాము వైసీపీ మద్దతు కోరామని స్పష్టం చేసారు. అయితే, టీడీపీ మాత్రం స్వచ్చందంగా ముందుకొచ్చి మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ముర్ముతో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీడీపీకి ధన్యవాదాలు చెప్పారు.

సామాజిక న్యాయం కోసమేనంటూ
తెలంగాణలో టీఆర్ఎస్ - కాంగ్రెస్ సిన్హాకు మద్దతుగా నిలవగా..బీజేపీ సభ్యులు ముర్ముకు అనుకూలంగా ఓటింగ్ చేయనున్నారు. దీంతో.. ఇప్పుడు ఏపీలో ముర్ముకు అనూహ్యంగా మద్దతు లభించటం తో ఇప్పుడు ఏపీ రాజకీయాల పైన జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమవుతోంది. రాష్ట్రపతి ఎన్నిక అసాధారనణ పరిస్థితుల్లో జరుగుతున్నాయని యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. ఆత్మ ప్రభోధానుసారం ఓటు వేయాలని ఆయన కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించటం ప్రధాన సవాలుగా నిలుస్తోందని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. టీడీపీ మాత్రం గిరిజన మహిళ రాష్ట్రపతి పదవకి పోటీలో ఉండటంతో.. సామాజిక న్యాయం కోసమే మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications