జగన్ పర్యటించిన ప్రాంతాలు మలినం అయ్యాయంటూ...పసుపు నీళ్లతో శుద్ధి
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర శనివారంతో ముగిసింది. అయితే జగన్ పాదయాత్ర ముగిసిన వెంటనే ఆ నియోజకవర్గంలో టిడిపి శ్రేణులు చేసిన ఒక పని అందరిని విస్మయపరిచింది.
జగన్ తమ ప్రాంతంలో పర్యటించడం వల్ల ఆయా ప్రాంతాలన్నీ మలినమైపోయాయంటూ జగన్ పర్యటన జరిగిన మేరా టిడిపి కార్యకర్తలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అయితే జగన్ ఈ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పై విమర్శల వర్షం కురిపించడానికి ప్రతిగా స్థానిక టిడిపి కార్యకర్తలు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ఈ మధ్య ఎమ్మెల్యే అని తెలుగు సినిమా విడుదలైందని, అక్కడ దానికి అర్థం మంచి లక్షణాలున్న అబ్బాయి అని...కానీ పెదకూరపాడులో మాత్రం 'మామూళ్లు లంచాలు తీసుకునే అబ్బాయ్' అని విమర్శించారు.
మరోవైపు జగన్ విమర్శలపై ఎమ్మెల్యే శ్రీధర్ కూడా స్పందించారు. తాను అవినీతికి పాల్పడినట్టు జగన్ నిరూపిస్తే...రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో జగన్ పర్యటన ముగిసిన వెంటనే టిడిపి కార్యకర్తలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. జగన్ పర్యటనతో తమ ప్రాంతం మలినమైపోయిందని అందుకే శుద్ధి చేస్తున్నామని వారు తెలపడం గమనార్హం. అయితే ఇటువంటి చర్యలు ఏ పార్టీ వారు చేసినా సరికాదని, దీనివల్ల వైషమ్యాలు పెరుగుతాయని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications