ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్ కు ఎన్నికల్లో నష్టం చేస్తుందా..!!
ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. అధికార,ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాన్ని వదులుకోవటం లేదు. ముఖ్యమంత్రి జగన్ ఓటమి లక్ష్యంగా కూటమి పార్టీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. జగన్ తన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ ప్రధానంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఈ యాక్ట్ ద్వారా భూములు లాగేసుకుంటారని ప్రచారంలో చెప్పుకొస్తున్నారు.
కార్నర్ చేస్తున్న చంద్రబాబు
కొద్ది రోజులుగా ఏపీ ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రచార అస్త్రంగా మారింది. చంద్రబాబు, పవన్ ప్రతీ సభలోనూ ఈ యాక్ట్ ద్వారా జగన్ భూములు లాగేసుకంటారని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం లోని ముఖ్యులు మాత్రం ఈ చట్టం నీతిఅయోగ్ సిఫార్సు మేరకు కేంద్రం తీసుకొచ్చిన చట్టంగా పేర్కొంటున్నారు. ఈ చట్టం ద్వారా లాభమే కానీ, నష్టం లేదని వివరిస్తున్నారు. దీని పైన మంత్రులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఈ చట్టం రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా ఈ అంశం పైన స్పందించటం లేదు.

పవన్ సైతం అదే దారిలో
తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఈ చట్టం పైన జరుగుతున్న ప్రచారం పై స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హిందూపురం ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు. జగన్ భూములిచ్చేవాడే గానీ.. లాక్కునేవాడు కాదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే ఐవిఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ యాక్ట్ గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసా అని ప్రశ్నించారు. భూములపై ప్రజలకు సర్వహక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వివరించారు.
సీఎం జగన్ క్లారిటీ
ఇది పెద్ద సంస్కరణ కాబోతోందని సీఎం స్పష్టం చేశారు. ఎలాంటి వివాదంలేదని భూములపై ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశం అన్నారు. వందేళ్ల తర్వాత మళ్లీ భూసర్వే చేయించి.. సరిహద్దు రాళ్లు పెట్టిస్తున్నానన్నారు సీఎం జగన్. ఇప్పటికే17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాల్లో సర్వే పూర్తైందని తెలిపారు. కార్డు 2 విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని.. ఇప్పటి వరకు 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. భూ హక్కుదారులకు పత్రాలు అందజేశామని కూడా తెలిపారు. అయితే, ఈ అంశం ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారటంతో ఎలాంటి ప్రభావం చూపుతందనే ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications