ఎన్డీఏ వైపే టీడీపీ- ముర్ముకు మద్దతు : వైసీపీతో పాటుగా - రేపు సమావేశం..!!
టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుందనే విషయం పైన టీడీపీ తమ నిర్ణయం వెల్లడించలేదు. ఎన్డీఏ లేదా విపక్ష కూటమి తమ మద్దతు కోరిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తూ వచ్చింది. లేకుంటే తటస్థంగా ఉండాలనే ఆలోచన ఒక దశలో చేసింది. కానీ, ఎన్నికలకు కేవలం వారం మాత్రమే సమయం ఉండటం.. రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ము అమరావతికి వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎన్డీఏ అభ్యర్దికి టీడీపీ మద్దతు
పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేతో చర్చించిన చంద్రబాబు..ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదించిన గిరిజిన మహిళ అయిన ముర్ముకు మద్దతు గా నిలవాలని నిర్ణయించారు. ఇప్పటికే వైసీపీ ముర్ముకు తమ మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎంపిక సమయంలో.. ప్రదాని మోదీ - హోం మంత్రి అమిత్ షా - రాజ్ నాధ్ సింగ్ సీఎం జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని మంత్రి పేర్ని నాని అధికారికంగా వెల్లడించారు.
కొందరు బీజేపీ నేతలు అసలు రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరలేదంటూ చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని సమాధానం ఇచ్చారు. ఇక, టీడీపీ అధినేత 2019 ఎన్నికల ముందు ఎన్డీఏతో దూరం అయిన తరువాత..తిరిగి ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

టీడీపీ - వైసీపీ ఒకే బాటలో
గతంలోనూ ఏపీలో కీలకంగా ఉన్న టీడీపీ - వైసీపీ రెండు పార్టీలు ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేసిన రామ్ నాధ్ కోవింద్ కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు తిరిగి మరోసారి అదే జరిగింది. టీడీపీ తొలి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో చెప్పుకొచ్చారు. గతంలో అబ్దుల్ కలాం.. కేఆర్ నారాయణ్ ను మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు.
రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ము రేపు ( మంగళవారం) అమరావతికి రానున్నారు. మధ్నాహ్నం 3 గంటలకు మంగళగిరిలోని ఒక ఫంక్షన్ హాల్ లో వైసీపీ ఎంపీలు - ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సీఎం జగన్ స్వాగతం పలికేలా షెడ్యూల్ ఖరారు చేసారు. ఆ తరువాత సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రపతి అభ్యర్ధి ముర్మూను తేనేటి విందుకు ఆహ్వానించారు.

అమరావతికి రానున్న ముర్ము
ఈ క్రమంలో అమరావతికి వస్తున్న ముర్మును టీడీపీ నేతలు సైతం కలిసే అవకాశం ఉంది. తమ మద్దతు సైతం ప్రకటించటం తో వైసీపీతో కాకుండా విడిగా టీడీపీ నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ఈ నెల 18న జరిగే పోలింగ్ లో చంద్రబాబు సైతం రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అసెంబ్లీకి రానున్నారు.
ఇప్పుడు ఏపీ నుంచి ఎలక్టోరల్ కాలేజ్ లో మొత్తం ఓటింగ్ ముర్ముకు మద్దతుగా పోల్ కానుంది. ఇప్పుడు వైసీపీ - టీడీపీ మద్దతు ప్రకటించటంతో.. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన నేతలు ముర్మును కలిసేందుకు ముందుకు వస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications