టీడీపీకే రెండు ఎమ్మెల్సీలు - వర్మకు దక్కేదేంటి..!!
ఏపీలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారయ్యారు. రెండు గ్రాడ్యేయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్ధులే పోటీ చేయనున్నారు. వారి పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల సమయంలో సీటు దక్కని వర్మకు ఈ సారి అవకాశం వస్తుందని అంచనా వేసినా ..నిరాశ తప్పలేదు. తాజాగా తూర్పు గోదావరి నుంచే ఎమ్మెల్సీ అభ్యర్ధిని టీడీపీ ఖరారు చేసింది. దీంతో, వర్మకు కూటమి ప్రభుత్వం లో దక్కే పదవి ఏంటనే చర్చ తెర మీదకు వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికలు
ఏపీలో త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ అభ్యర్ధులను ఖరారు చేసింది. రెండు నియోజకవర్గాల్లోనూ తామే పోటీ చేయాలని నిర్ణయించింది. తమ అభ్యర్ధుల ఎంపిక గురించి జనసేన, బీజేపీకి సమాచారం ఇచ్చింది. ఆ రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఫలితంగా మిత్రపక్షాలకు ఈ ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ప్రకటించింది. అదే విధంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేరును ఖరారు చేసారు.

ఇద్దరు పేర్లు ఖరారు
ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ కోసం సీటు తెనాలి అసెంబ్లీ సీటు త్యాగం చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. మరో అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ సైతం గత ఎన్నికల్లో టీడీపీ నుంచి సీటు ఆశించారు. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలానికి చెందిన రాజశేఖర్ గతంలో ఎంపీపీగా, జడ్పీటీసీగా పనిచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కార్యక్రమాల కమిటీ పర్యవేక్షకుడిగా రాజశేఖర్ వ్యవహరించారు. కాకినాడ రూరల్ నుంచి తనకు అవకాశం కల్పించాలని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేతను కోరారు. కాగా, ఆ సీటు జనసేనకు వెళ్లింది. దీంతో, ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
పిఠాపురం కేంద్రంగా
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత భర్తీ చేసిన తొలి విడత ఎమ్మెల్సీ సీట్లలో జనసేన నుంచి హరిప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. అయితే, పవన్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న వర్మకు కూటమి అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. కూటమి తొలి విడత నామినేటెడ్ పదవుల్లోనూ అవకాశం ఇవ్వలేదు. పవన్ గెలుపులో వర్మ కీలకంగా వ్యవహరించారు. వర్మకు సొంత నియోజకవర్గంలోనూ ప్రాధాన్యత తగ్గిందనే వాదన ఉంది. దీంతో, వర్మకు పదవి విషయంలో జరుగుతున్న తాత్సారం ఇప్పుడు పిఠాపురంలో కీలక అంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications