"మెగా" ఛాన్స్ - టీడీపీ, జనసేన నుంచి రాజ్యసభకు ఆ ఇద్దరు..!!
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు..ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామా చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడుగా పేరున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామా ఖాయమైంది. అదే విధంగా మరో ఎంపీ బీదా మస్తానరావు సైతం రాజీనామాకు సిద్దమయ్యారు. ఈ ఇద్దరి స్థానంలో కూటమి నుంచి ఇద్దరు రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఆ ఇద్దరి పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
వైసీపీ ఎంపీల రాజీనామా
ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. వైసీపీ నుంచి 11 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఇద్దరు బీదా మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడటం దాదాపు ఖాయమైంది. ఈ ఇద్దరు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ ఇద్దరికీ రాజకీయ భవిష్యత్ పైన రాజకీయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. మోపిదేవికి ఎమ్మెల్సీగా..భవిష్యత్ లో ఆయన కుమారుడికి సీటు పైనా హామీ వచ్చిందని చెబుతున్నారు.

కూటమికే రెండు స్థానాలు
ఇక, బీదా మస్తానరావు తాను టీడీపీలో చేరి రాజ్యసభకు కొనసాగుతానని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, మస్తానరావుకు సైతం ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని..ఈ సారి రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో..ఇప్పుడు ఈ ఇద్దరు రాజ్యసభలో తమ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా కూటమి నుంచి ఇద్దరు సభ్యుల ఏక్రగీవంగా జరగనుంది. టీడీపీ నుంచి గల్లా జయదేవ్ కు అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.

నాగబాబు - జయదేవ్ కు ఛాన్స్
గతంలో రెండు సార్లు ఎంపీగా పని చేసిన జయదేవ్..ప్రస్తుతం ఏపీలో పెట్టుబడుదారులతో చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండో స్థానం నుంచి మెగా బ్రదర్ నాగబాబు జనసేన కోటాలో రాజ్యసభకు ఎంపిక కానున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. నాగబాబు విషయం పెండింగ్ పడితే..గతంలో రాజ్యసభ హామీ దక్కి చివరి నిమిషంలో ఆగిపోయిన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, నాగబాబు...గల్లా జయదేవ్ పేర్లు ఖాయమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications