టీడీపీ ఆఫీసులో పీవీ వర్ధంతి- ఏపీలో ఇదే తొలిసారి- ఆసక్తికర చర్చ
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నేతలు ఇవాళ నివాళులు అర్పిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలో విపక్ష టీడీపీ నేతలు కూడా తమ పార్టీ కార్యాలయంలో పీవీ వర్ధంతి నిర్వహించారు. ఆర్ధిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసిన వ్యక్తి పీవీ నరసింహారావు
అంటూ టీడీపీ నేతలు పీవీకి ఘన నివాళి అర్పించారు. సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించిన వ్యక్తి పీవీ అని నేతలు కొనియాడారు.
పీవీ వర్ధంతి సందర్భంగా మంగళగిరిని ఆత్మకూరులో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నివాళులు అర్పించారు.
తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నాడు నంద్యాల పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికలల్లో పీవీపై ఎన్టీఆర్ టీడీపీ తరపున అభ్యర్థిని పోటీలో పెట్టలేదని వారు గుర్తు చేసుకున్నారు. ఏపీలో టీడీపీ గతంలో ఎప్పుడూ పీవీ వర్ధంతి వేడుకలు నిర్వహించలేదు. తొలిసారిగా పీవీ వర్ధంతిని ఏకంగా పార్టీ కేంద్ర కార్యాలయంలోనే నిర్వహించారు. దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఒకప్పుడు కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపి కాంగ్రెస్ పార్టీ గౌరవం కాపాడిన మాజీ ప్రధాని పీవీ మృతి తర్వాత కాంగ్రెస్ నేతలు ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. చివరికి ఆయన మృతదేహాన్ని కూడా ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండా హైదరాబాద్ పంపేశారు. దీనిపై ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతూనే ఉంటాయి. అయితే మారిన పరిస్ధితుల్లో కాంగ్రెస్ పార్టీ వదిలేసిన పీవీని బీజేపీ, టీడీపీతో పాటు టీఆర్‌ఎస్ కూడా సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయంలో టీడీపీ తమ పార్టీ నేత కాని పీవీ వర్ధంతి నిర్వహించిందా అన్న చర్చ జరుగుతోంది.