ఆల్ పార్టీ భేటీ అడిగా, ఎవరేమిటో తెలియాలనే: బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాను గతంలో కోరానని, కేంద్రం ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న అఖిల పక్ష సమావేశం ఎవరు ఏమిటో తెలియాలనే పెడుతున్నారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అఖిల పక్ష సమావేశం వల్ల సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అభిప్రాయపడ్డారు.
అఖిలపక్ష సమావేశం వల్ల మంచి జరుగుతుందని సీమాంధ్ర నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సిపిఎం మినహా అన్ని పార్టీలు రాష్ట్రాన్ని విభజించాలనే చెప్పాయని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని తెలుగుదేశం పార్టీ అన్ని అఖిల పక్ష సమావేశాల్లోనూ చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నందున పార్టీలు రాజకీయ చేయడం మానేసి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అపోహలను, అనుమానాలను పక్కకు పెట్టి పార్టీలు వాస్తవాలకు దగ్గరగా వెళ్లాలని ఆయన సూచించారు. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించవద్దని ఆయన సలహా ఇచ్చారు.
అధికారం కోసం రాజకీయం చేయడం మానేసి సామరస్యవూర్వక వాతావరణంలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. పార్టీని నష్టపరిచే, కించపరిచే మాటలు మానుకోవాలని, లేదంటే వారి ఇష్టప్రకారం నడుచుకోవాలని ఆయన కాంగ్రెసు నాయకులకు సూచించారు. ఇరు ప్రాంతాల్లోని సెంటిమెంటును అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారం కోసమే కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కిరణ్ పార్టీ పెట్టరు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టబోరని బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునేవారు వెళ్లిపోవచ్చునని, అంతేగానీ పార్టీని నష్టపరిచే వ్యాఖ్యలు చేయవద్దని ఆయన అన్నారు. అవకాశాల కోసం పార్టీ నాయకులు కొందరు పక్క చూపులు చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేస్తానని అంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలా, వద్దా అని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తండ్రి పాత్ర పోషించాలని అంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ఆ రోజు సమైక్యం గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications