కిరణ్ సస్పెన్స్: టిడిపి, జగన్ లిస్ట్ పెద్దదే
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందని భావిస్తున్న పలువురు నేతలు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులోకి వెళ్లేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారు.
అయితే, కిరణ్ కొత్త పార్టీపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. పలువురు నేతలు టిడిపి, జగన్ పార్టీల నాయకులతో మాట్లాడుతున్నారు. ఆ పార్టీలు కూడా అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెసు నేతలకు గాలం వేస్తున్నాయట. సమైక్యవాదం వినిపిస్తున్న జగన్, సమన్యాయం డిమాండ్ చేస్తున్న టిడిపిలోకి వెళ్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారట.

జనవరి 23వ తేదీలోగా విభజన ముసాయిదా బిల్లు పైన రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయం అడిగారు. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు సహా చాలామంది నేతలు సభలో విభజనపై తమ వ్యతిరేకతను గట్టిగా చెప్పి, బిల్లు రాష్ట్రపతికి పంపిన తర్వాత పార్టీ మారే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విభజన ప్రకటన తర్వాత ఇప్పటికే పలువురు కాంగ్రెసు నేతలు జగన్ పార్టీలో చేరారు.మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా త్వరలో జగన్ పార్టీ జెండా పట్టుకోనున్నారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర కూడా జగన్‌కు జై కొట్టనున్నారు.
మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్‌లు తెలుగుదేశం పార్టీలో చేరవచ్చునని, అనంతపురం జిల్లా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే జెసి తనయుడు పవన్ కుమార్ రెడ్డి జగన్ పార్టీ తరఫున 2014 ఎన్నికలలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. జెసి సోదరులు తొలుత టిడిపిలోకి వెళ్లాలని భావించినా ఆ పార్టీలోని ఓ వర్గం కారణంగా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు, తోట నర్సింహం సహా పలువురు శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయట.
రాయలసీమ ప్రాంతం నుండి వెంకట స్వామి, రాంభూపాల్ రెడ్డి, శిల్పామోహన్ రెడ్డిలు త్వరలో కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయంటున్నారు. శిల్పా మోహన్ రెడ్డి గతంలో వైయస్ జగన్‌ను కలిసినప్పటికీ టిక్కెట్ పైన హామీ రాలేదంటున్నారు. దీంతో ఆయన మనసు మార్చుకొని టిడిపి వైపు చూస్తున్నారట. కాటసాని రాంభూపాల్ రెడ్డి టిడిపి లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో ఎందులో చేరాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారట.
అనంతపురంలో జెసి కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ లోకసభ, ఓ అసెంబ్లీ టిక్కెట్‌ను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందట. జెసి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఎప్పటి నుండో అనంతపురం నుండి లోకసభకు పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. అనంత వెంకట్రామి రెడ్డి ఈ కారణంగానే వెనక్కి తగ్గారని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి గల్లా అరుణ తనయుడు గల్లా జయదేవ్ గుంటూరు లోకసభ స్థానం నుండి పోటీ చేసేందుకు టిడిపిలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్టీ వర్గాలతో చర్చలు జరిపినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications