మాపై దోషం: రఘువీరా, జగన్‌కు బుద్ధి చెప్పారు: సిఎం
హైదరాబాద్: విభజన విషయంలో తమ పార్టీని దోషిగా చూపడంలో విపక్షాలు సఫలమయ్యాయని ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం అన్నారు. ఆయన హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీ ఫలితాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు.
అయితే, ఈ ఫలితాలు రేపు (జడ్పీటీసీ, ఎంపీటీసీ లెక్కింపులో) పునరావృతం కావని చెప్పారు. మే 16 ఫలితాలు ఇలాగే ఉంటాయని తాము అనుకోవడం లేదన్నారు. విభజన పాపం కాంగ్రెసు పార్టీ పైన వేయడంలో వారు సఫలమయ్యారన్నారు. విభజన పాపాన్ని తమ పైకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతిపరులను తిరస్కరించారు: సిఎం రమేష్
జగన్ అవినీతికి సీమాంధ్ర ప్రజలు బాగా బుద్ధి చెప్పారని టిడిపి ఎంపి సిఎం రమేష్ వేరుగా అన్నారు. సీమాంధ్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో విజ్ఞత ప్రదర్శించారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వెల్లడికానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రజలు అవినీతికి పట్టం కట్టరని, టిడిపి అధికారంలోకి వచ్చి సీమాంధ్రను అభివృద్ధి పథాన నిలుపుతుందన్నారు.
దుర్మార్గులను రాష్ట్రం నుండి పారద్రోలాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఎన్డీయే కూటమికి 300 లోకసభ స్థానాలు వస్తాయన్నారు. సీమాంధ్రలో టిడిపి, బిజెపి కూటమిదే అధికారమన్నారు. బాబుపై సీమాంధ్రుల నమ్మకానికి ఈ విజయం నిదర్శనమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి సత్తా చాటిందని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలోకి వస్తుందని మున్సిపల్ ఫలితాల ద్వారా రుజువైందన్నారు. బాబు నాయకత్వాన్ని సీమాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
చంద్రబాబు కష్టం, కార్యకర్తల కృషి ఫలించిందని టిడిపి ఎంపి గరికపాటి రామ్మోహన్ రావు అన్నారు. చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణ మాఫీని ప్రజలు నమ్మారన్నారు. టిడిపి విజయం ప్రజలు, కార్యకర్తలదే అన్నారు. నాలుగు రోజుల్లో వెలువడే అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు. బాబు పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో టిడిపి క్లీన్ స్వీప్ చేసిందన్నారు.












Click it and Unblock the Notifications