బాలికపై టీచర్ లైంగిక వేధింపులు: మరుగుదొడ్డి గుంతలో పడి చిన్నారి మృతి
నెల్లూరు: పిల్లలను సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాడు. ఓ విద్యార్థిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. విషయం బయటపడడంతో పరారయ్యాడు.
నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం పుదూరులోని బాలకల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్ధినిని కొన్ని రోజులుగా ఉపాధ్యాయుడు వేధించసాగాడు. ఉపాధ్యాయుడి వేధింపులు శృతి మించడంతో విషయాన్ని బాలిక తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.

సోమవారం మధ్యాహ్నం బాలిక తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. వెంటనే ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు పరారయ్యారు. ఉపాధ్యాయుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లాలో రాపూరు మండలంలో దారుణం జరిగింది. సోమవారం మధ్యాహ్నం జోరేపల్లిలో రెండున్నరేళ్ల వయస్సు గల ఓ చిన్నారి ప్రమాదవశాత్తు అంగన్‌వాడీ మరుగుదొడ్డి గుంతలో పడింది. ఎవరూ గమనించక పోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకున్నారు. చిన్నారి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications