మారుతి స్విఫ్ట్‌తో ఆర్టీసి బస్సు ఢీ: టెక్కీ మృతి
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మరణించాడు. ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు టెక్కీ ప్రయాణిస్తున్న మారుతి స్విఫ్ట్ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
మృతుడిని బాలానగర్‌లోని వినాయక్‌నగర్‌కు చెందిన పాతికేళ్ల గాదిళ్ల వరుణ్‌గా గుర్తించారు. ఆర్టీసి బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు చెబుతున్నారు. తలకు, ఇతర చోట్ల బలమైన గాయాలు తగలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరుణ్ మరణించాడు.

కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని అన్నారు. నిర్లక్ష్యంగా బస్సు నడపాడనే ఆరోపణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్ట్స్ కళాశాల సమీపంలోని గంగా హాస్టల్ వద్ద ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications