ఇనుపరాడ్ తో కొట్టి.. విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య!!
విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు నిన్న అర్ధరాత్రి ఒక తహసిల్దార్ పై ఇనుప రాడ్ తో దాడి చేయడంతో ఆయన మరణించిన ఘటన చోటు చేసుకుంది. విశాఖ రూరల్ తహసీల్దారుగా పనిచేసిన రమణయ్య ను గుర్తు తెలియని దుండగుడు హతమార్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే కొమ్మాది లోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో తహసిల్దార్ రమణయ్య కుటుంబం నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి రమణయ్య తో మాట్లాడాలని పిలిచారు. దీంతో తహసిల్దార్ రమణయ్య ఆ వ్యక్తితో మాట్లాడాడు. అయితే ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

తహసిల్దార్ రమణయ్య తో వాగ్వాదానికి దిగిన వ్యక్తి తన వెంట తీసుకువచ్చిన ఇనుప రాడ్ తో రమణయ్య పై దారుణంగా దాడి చేశారు. దీంతో రమణయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. ఇక అపార్ట్మెంట్లో ఉన్నవారు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. ఇక తీవ్ర గాయాల పాలైన రమణయ్య ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మరణించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం వరకు విశాఖ రూరల్ తహసీల్దార్ గా రమణయ్య పని చేశారు. రమణయ్య విధినిర్వహణలో చాలా నిజాయితీగా ఉండేవాడని ఆయనతో కలిసి పనిచేసిన సహోద్యోగులు చెబుతున్నారు.అసలు తహసీల్దార్ రమణయ్యను హతమార్చింది ఎవరు? రమణయ్య కు అతనికి మధ్య ఉన్న గొడవ ఏమిటి? రమణయ్యపై దాడి చేసింది ఏదైనా ల్యాండ్ మాఫియానా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుడిని పట్టుకోవడానికి సీరియస్ గా దృష్టి సారించిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులో కీలక దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించటంతో పాటు రమణయ్య మొబైల్ ఫోన్ నుండి కూడా కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications