టిడిపితో కలిసి టీకి బిజెపి తూట్లు, బరితెగింపే: నారాయణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణకు తూట్లూ పొడిచేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. నారాయణ సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చను అడ్డుకుంటామనడం బరితెగింపేనని నారాయణ అన్నారు.
జనవరి 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన తర్వాత తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచాలని ఆయన కోరారు. సీమాంధ్రలో రాజధాని ఏర్పాటు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించాలని నారాయణ కోరారు.

టి ప్రక్రియ వేగవంతం చేయండి: కోదండరాం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆయన సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. తాము చెప్పినవన్నీ రాష్ట్రపతి సావధానంగా విన్నారని అన్నారు. తమ విజ్ఞప్తులను స్వీకరించారని తెలిపారు.
టి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి: విద్యాసాగర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, పార్లమెంటులో ఆమోదింపజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఆయన కరీంనగర్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అసెంబ్లీలో సీమాంధ్ర నాయకులు చించివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇతర దేశాల సభల్లో ఇలా వ్యవహరిస్తే సభ నుంచి బయటికి పంపించి వేస్తారని అన్నారు.
ఉధృతం చేస్తాం: అశోక్ బాబు
పశ్చిమ గోదావరి: జనవరి 16 నుంచి సమైక్య ఉద్యమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తర్వలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఏపిఎన్జీవో సంఘం ఎన్నికలు ఎప్పుడూ రెండు వర్గాల మధ్యే జరుగుతాయని అశోక్‌బాబు తెలిపారు.
ఎన్నికల తర్వాత అంతా కలిసి పనిచేస్తున్నామని, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అశోక్ బాబు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్లే ఏపిఎన్జీవో సంఘం ఎన్నికలకు ప్రాధన్యత కలిగిందని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, ఇదేదో నేరపూరితమైన ప్రశ్నగా తనను పదే పదే అడుగుతున్నారని అశోక్‌బాబు అన్నారు.












Click it and Unblock the Notifications