ఒకే వేదికపైకి కేసీఆర్, చంద్రబాబు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ఉద్ధండులు ఒకే వేదికపై కలవబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబునాయుడు ఇద్దరూ ఈనెల 25వ తేదీన హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ర్యాలీకి హాజరు కాబోతున్నారు. మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతిని పురస్కరించుకొని ఐఎన్ఎల్ డీ ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా వీరిని ఆహ్వానించారు. కేసీఆర్, చంద్రబాబుతోపాటు దేశంలోని కీలక నేతలందరినీ ఈ ర్యాలీకి ఆహ్వానిస్తున్నట్లు చౌతాలా వెల్లడించారు.
దేశంలో భారతీయ జనతాపార్టీ పాలనపై ప్రజలు విసిగిపోయివున్నారని, అందుకే ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ర్యాలీకి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తదితరులను ఆహ్వానించినట్టు అభయ్ చౌతాలా తెలిపారు.

ఈనెల 25వ తేదీన కేంద్రంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రాబోతున్నాయి. అయితే ఈ ర్యాలీ పూర్తిగా భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా కొనసాగే అవకాశం ఉంటే ఆ పార్టీతో స్నేహాన్ని కోరుకుంటున్న చంద్రబాబు దూరంగా ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని, ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపై ఉండటంతో ఆయన చేస్తున్న పోరాటానికి మరింత మద్దతు లభించొచ్చనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications