మెట్రో ట్విస్ట్, రివర్స్: గాడ్గిల్‌కి కేసీఆర్ క్లాస్, షాకిచ్చేనా?
హైదరాబాద్: మెట్రో రైలు అంశంపై ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్ లేఖ రాయడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అందుకు ధీటుగానే స్పందించారని చెబుతున్నారు. అదే సమయంలో అధికారులకు కూడా ధీటుగా స్పందించాలని సూచనలు చేశారని తెలుస్తోంది. ఆలైన్‌మెంట్ మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ను తిప్పికొట్టేందుకు ఎల్ అండ్ టి మెట్రోరైలు సంస్థ వేసిన పాచిక బెడిసికొట్టిందని అంటున్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని ఎల్ అండ్ టి సంస్థ లిఖితపూర్వకంగా రాసిన లేఖను యధాతధంగా ఆమోదించి ఈ ప్రాజెక్టును మరో కంపెనీకి అప్పగించే సాధ్యాసాధ్యాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని ఎల్ అండ్ టి సంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ రాయడాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఎల్ అండ్ టి వంటి పెద్ద కంపెనీలు ప్రపంచంలో చాలా ఉన్నాయని, వారి వల్ల కాదంటే, మీరు పెట్టిన డబ్బులు మీకు ఇచ్చేసి వేరే కంపెనీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అని ఎల్ అండ్ టి కంపెనీ ఎండి గాడ్గిల్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

మెట్రో రైలు కథనాలపై వివరణ ఇవ్వడానికి గాడ్గిల్ వెళ్లినప్పుడు కెసిఆర్ పైవిధంగా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి తనంతకు తానుగా తప్పుకుంటామని ఎల్ అండ్ టి సంస్థే ముందుకు రావడంతో వేరే కంపెనీకి అప్పగించడానికి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకపోవడంతో ఆ దిశగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నారని అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని చూసిన ఎల్ అండ్ టి సంస్థకు షాక్ ఇవ్వడమే కాకుండా, రాష్ట్ర విభజననే వ్యతిరేకించిన సంస్థను పక్కకు తప్పించినట్టు అవుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని అంటున్నారు. తెలంగాణకు బొడ్రాయి లాంటి హైదరాబాద్‌లో మెట్రో రైలు వ్యాపారం చేయడానికి ముందుకు వచ్చిన ఎల్ అండ్ టి సంస్థ రాష్ట్ర విభజననే వ్యతిరేకిస్తూ తన లేఖలో పేర్కొనడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకించడం అంటే మౌలికంగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినట్టేనని, అలాంటి సంస్థను మెట్రో రైలు వంటి భారీ ప్రాజెక్టులో ఎలా కొనసాగిస్తారని ముఖ్యమంత్రి పైన ఒత్తిడి కూడా పెరుగుతోందని అంటున్నారు. పైగా ఎల్ అండ్ టి లేఖను మీడియాకు లీక్ చేయడం వెనుక ఇతరుల హస్తం ఉన్నట్టు రూఢీ అయిందని, అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడిన ఎల్ అండ్ టిని మెట్రో రైలు నుంచి తప్పించాలని కెసిఆర్‌పై ఒత్తిడి వస్తోందని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications