గవర్నర్‌తో కెసిఆర్ గంటపాటు మంతనాలు: కేబినెట్లోకి సురేఖను తీసుకునేనా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం 5.30 గంటలకు వచ్చిన కెసిఆర్ గంటసేపు గవర్నర్‌తో పలు అంశాలపై చర్చించారు. మంత్రుల శాఖల మార్పు గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.
సీఎం గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, కొత్తవారికి చోటు తదితర అంశాలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో మహిళలు లేకపోవడం, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటానని గతంలోనే ప్రకటించినందున కేబినెట్‌లో మార్పు చేర్పులపై పార్టీలో ఊహాగానాలు జోరందుకున్నాయి.

కేసీఆర్ ఈసారి తన కేబినెట్లోకి ఓ మహిళను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ కేబినెట్లో మహిళా మంత్రి ఒక్కరు కూడా లేకపోవడంపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. విపక్ష మహిళా నేతలు కూడా దీనిని ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ ఎంపీ కవిత కూడా దీనిపై నిరాశ వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఈసారి కేబినెట్ విస్తరణ సమయంలో మహిళకు చోటు కల్పించాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఆ పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో పద్మా దేవేందర్ రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, గొంగిడి సునీత రెడ్డి ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. కోవా లక్ష్మీ పార్లమెంటరీ సెక్రటరీగా నియమితులైనప్పటికీ.. ఆ నియామకాలను కోర్టు వెనక్కి తీసుకోవాలని సూచించింది. మిగిలినవారు కొండా సురేఖ, రేఖా నాయక్, బొడిగే శోభలు ఉన్నారు.












Click it and Unblock the Notifications