వైఎస్ జగన్ తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ-షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ ప్రచారం వేళ ?
తెలంగాణ కాంగ్రెస్ లో తాజాగా చేరిన వైసీపీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. గతంలో ఓసారి జగన్ తో భేటీ అయిన పొంగులేటి.. ఇవాళ మరోసారి తాడేపల్లికి వచ్చి సీఎంను కలిశారు. దాదాపు గంట సేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. తాజాగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న పొంగులేటి ఇవాళ జగన్ తో భేటీ కావడంతో పలు ఊహాగానాలు సాగుతున్నాయి.
పొంగులేటి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరకముందు వైఎస్ జగన్ ను కలిసినప్పుడు వ్యాపార పనుల నిమిత్తం వచ్చారని భావించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఉంటూ వైఎస్సార్సీపీ అధినేతగా ఉన్న జగన్ ను ఆయన కలవడంతో ఇరువురి చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇవాళ వీరిద్దరి చర్చల్లో కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు సిద్ధమైన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల టాపిక్ కీలకమని తెలుస్తోంది.

ముఖ్యంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏపీసీసీ ఛీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చేరిక ప్రభావం వైసీపీపై ఏ విధంగా ఉంటుందన్న దానిపై వైఎస్ జగన్-పొంగులేటి చర్చించుకుని ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. షర్మిలను పులివెందుల నుంచి పోటీ చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో అదే జరిగితే పరిస్ధితులు ఎలా ఉండొచ్చన్న దానిపైనా చర్చించి ఉండొచ్చని తెలుస్తోంది.
మరోవైపు ప్రస్తుత పరిస్ధితుల్లో తెలంగాణను వదిలి ఏపీ రాజకీయాల్లోకి వచ్చేందుకు షర్మిల ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా నెలకొంది. తెలంగాణలో పార్టీ పెట్టి ఏపీకి వెళ్లిపోతే విమర్శలు తప్పవని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిలను తమపై రుద్దొద్దని, ఆమెను ఏపీకి పంపితేనే ప్రయోజనం ఉంటుందని అధిష్టానానికి చెబుతున్నారు. ఇటు ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిల రాకతో తమకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుందనే లెక్కల్లో ఉన్నారు.












Click it and Unblock the Notifications