వాళ్లకు నోటీసులు, డిసెంబర్లో టి డ్రాఫ్ట్: బొత్స సంచలనం
హైదరాబాద్: పక్క చూపులు చూస్తున్న వాళ్లే విభజన అంశంలో పార్టీని ముద్దాయిని చేస్తున్నారని, వాళ్లకు త్వరలో నోటీసులు ఇస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. విభజన అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడారు.
విభజన అంశంలో పార్టీని ముద్దాయిగా చేస్తున్న వారికి త్వరలో నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని తెలిపారు. నోటీసులు ఎంతమందికి ఇస్తామనే విషయం త్వరలో చెబుతానన్నారు. ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెసు పార్టీలో అందరూ అర్హులేనని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నేతలు ఒక్క తాటి పైన లేకపోవడం వల్లనే విభజనకు ఆస్కారం ఏర్పడిందన్నారు. పదవుల కోసమే నేతలు రాజీనామా చేయడం లేదన్నారు.

డిసెంబరు మొదటి వారంలో టి డ్రాఫ్ట్
డిసెంబరు మొదటి వారంలో తెలంగాణ డ్రాఫ్ట్ వస్తుందని బొత్స తెలిపారు. అసెంబ్లీ ప్రోరోగ్ సమస్య కాదన్నారు. విభజనకు అనుకూలంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లేఖలు ఇచ్చాయన్నారు. ఇప్పుడు ఆ పార్టీలు కాంగ్రెసు పార్టీని దోషిగా చిత్రీకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
సాక్ష్యులను ప్రభావితం చేసేందుకే జగన్ పర్యటన: విహెచ్
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. సాక్ష్యులను ప్రభావితం చేసేందుకే జగన్ వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారని ఆరోపించారు. ఏదో జరుగుతుందని కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అసత్యాలు చెప్పి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ నేతలు సైతం విిధ పార్టీల నేతలను కలవాలని సూచించారు. జెడి(యు) నేత శరద్ యాదవ్‌ను కలిసి వాస్తవాలు వివరించాలన్నారు.












Click it and Unblock the Notifications