బాబుకు రివర్స్: తూగోలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, కేసీఆర్‌కి గాలి ప్రశంస
రాజమహేంద్రవరం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరగడం సహజమే. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లోని తెలంగాణవాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే, విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆవిర్భావ వేడుకలు జరగడం గమనార్హం.
విభజన నేపథ్యంలో ఏపీ బాగా నష్టపోయిందని, జూన్ 2న మనమంతా ఓ దీక్షగా చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే, తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెంలో మాత్రం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించి ప్రత్యేకత చాటుకున్నారు.
రావులపాలెం జాతీయ రహదారి కూడలిలో గురువారం తెలంగాణ రాష్ట్ర సీమాంధ్రుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ సంగినీడి సీతారాం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. స్థానిక అమలాపురం రోడ్డులో కోనసీమ ముఖ ద్వారం వద్ద నుండి పలువురు తెలంగాణ సిఎం కెసిఆర్ చిత్రంతో ఉన్న ఫ్లెక్సీ చేతపట్టుకుని కెసిఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించారు.

అనంతరం స్థానికులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సుమారు కోటి మంది సీమాంధ్రులు జీవిస్తున్నారన్నారు. అక్కడి సీఎం కెసిఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి నేటి వరకూ తరతమ భేదాలు లేకుండా పాలన సాగించడం, సీమాంధ్రులను కూడా ప్రభుత్వంలో భాగస్వాములను చేయడం హర్షణీయమన్నారు.
కొన్ని అవకాశవాద రాజకీయ పార్టీలు సీమాంధ్రుల్లో అపోహలు సృష్టించి తెలంగాణలో సీమాంధ్రులను వేధింపులకు గురిచేస్తారనే విషప్రచారం చేశారన్నారు. సీమాంధ్రులపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, దీనిని బట్టి కెసిఆర్‌ది జనరంజక పాలన అని రుజువైందన్నారు. అలాగే కెసిఆర్ జన్మదినాన్ని సీమాంధ్రలో నిర్వహించి తమ సీమాంధ్ర ఐక్య వేదిక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు.
కేసీఆర్‌కు గాలి శుభాకాంక్షలు
తెలంగాణ పోరాడి సాధించుకున్నారని, ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతున్నానని టిడిపి నేత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. తమకు ఇష్టం లేకపోయినా విభజనను రుద్దారని, ఏపీ లోటు బడ్జెట్లో ఉన్నా చంద్రబాబు రుణమాఫీ చేశారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి లేదని, రెండు రాష్ట్రాలు బాగుండాలన్నదే తమ విధానమన్నారు.












Click it and Unblock the Notifications