దమ్ముందా షర్మిలా: టీ మంత్రి కేసీఆర్‌కి గట్స్‌లేకే: లోకేష్
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగిస్తారని ప్రచారం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తెలంగాణలో పర్యటిస్తారనే ప్రకటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, తెరాస నేతలు స్పందిస్తున్నారు. లోకేష్, షర్మిల తెలంగాణలో తిరుగుతామంటే తరిమికొడతామని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి శుక్రవారం హెచ్చరించారు.
తెలంగాణలో ఆంధ్రా నేతలు తిరిగితే తాము ఊరుకునేది లేదన్నారు. షర్మిలకు దమ్ముంటే తెలంగాణలో తిరగాలని సవాల్ చేశారు. తెలంగాణకు ఆంధ్రా నేతలు నాయకత్వం వహిస్తామంటే తాము ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. నారా లోకేష్‌ను తెలంగాణలో తిరగనిచ్చేది లేదన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిలు తమ ఉనికిని కాపాడుకునేందుకే తమ పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
లోకేష్ మండిపాటు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నారా లోకేష్ మరోసారి ట్విట్టర్లో ధ్వజమెత్తారు. చంద్రబాబుతో తెలంగాణ అభివృద్ధి పైన చర్చించేందుకు కేసీఆర్‌కు గట్స్ లేవని మరోసారి తేటతెల్లమైందన్నారు.
సమయం వృథా చేసేందుకు, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ తన మంత్రులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు రావాలని అంతకుముందు లోకేష్ సవాల్ చేయగా.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అవసరం లేదని తాము వస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
చంద్రబాబును కొరివిదెయ్యంతో పోల్చిన జగదీశ్వర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి కొరివిదయ్యంతో పోల్చారు. తెలంగాణ ప్రజల పట్ల చంద్రబాబు కొరివిదయ్యంలా తయారయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమన్నారు. పీపీఏలను రద్దు చేసింది బాబేనని, అబద్ధాలతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు కుట్రలను త్వరలోనే బట్టబయలు చేస్తామన్నారు. బొగ్గు గనులు తెలంగాణలో ఉంటే రాయలసీమలో థర్మల్ ప్లాంట్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వం రెచ్చగొడుతోంది.: ధర్మాన
సరస్వతి పవర్ మైనింగ్ సంస్థ భూములను ఆక్రమించుకోవాలంటూ రైతులను ప్రభుత్వమే ప్రోత్సహించడం సరికాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్ట నేత ధర్మాన ప్రసాదరావు హైదరాబాదులో అన్నారు. సరస్వతి పవర్ మైనింగ్ లీజులు రద్దు చేయడానికి గల కారణాలు సహేతుకంగా లేవన్నారు. ఇలా తరువాతి ప్రభుత్వాలు కూడా కక్ష సాధింపు చర్యలకు దిగితే టీడీపీ పరిస్థితి ఏమిటన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో పరిశ్రమలు స్థాపించాలని పిలుపునిస్తుండగా, ఏపీలో ఏర్పాటు చేస్తామన్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన మిగతా కంపెనీల అనుమతులు ఎందుకు రద్దు చేయలేదన్నారు. సరస్వతి పవర్ మైనింగ్ సంస్థ కొనుగోలు చేసిన భూములను ఆక్రమించుకోవాలంటూ ప్రభుత్వం పిలుపునివ్వడం సరికాదన్నారు. ప్రజలను ఇలాంటి చర్యలకు ప్రోత్సహించకూడదన్నారు.












Click it and Unblock the Notifications