కీలక మలుపు తిరిగిన మంత్రుల మాటల యుద్ధం? బీజేపీకి B టీమ్
తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలతో మొదలైన ఏపీ, తెలంగాణ మంత్రుల మాటల యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏపీ మంత్రులు బొత్స, అమర్నాథ్ తోపాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ బదులిచ్చారు. కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గుంగల వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేశారని నిప్పులు చెరిగారు.

ఎందుకు విషం చిమ్ముతున్నారు?
తెలంగాణపై, టీఆర్ఎస్ పై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడేవాళ్లను హెచ్చరిస్తున్నానని, రెచ్చగొడితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, భారతీయ జనతాపార్టీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందంటూ గంగుల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరీష్ రావుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు!
హరీష్ రావుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, సజ్జల మాతో ఎందుకు పెట్టుకుంటున్నారని గంగుల ప్రశ్నించారు. మా సంగతి తెలియదా? గతంలో చూశారు.. మళ్లీ చూస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డిది కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే బుద్ధి అని, వైఎస్ కుటుంబంలోకి వచ్చి తల్లి, కుమారుడు, చెల్లిని విడదీశారన్నారు.
అక్కడ విడగొట్టినట్లుగా కేసీఆర్ కుటుంబాన్ని సజ్జల విడగొట్టాలనుకున్నా ఏమీ చేయలేరన్నారు.

తెలంగాణకు పెరిగిన వలసలు!
జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే తెలంగాణకు వలసలు పెరిగాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎక్కువ పథకాలున్నాయని హరీష్ రావు అన్నారని, కానీ మంత్రులు ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారన్నారు. వైసీపీ మంత్రులు బొత్స, అమర్నాథ్, సజ్జల వరుసగా హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ గా గంగుల కమలాకర్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications