కేసీఆర్ నాపై చర్య తీసుకోవచ్చు!: టీడీపీ నేతలతో బాబు
హైదరాబాద్: విభజన చట్టాన్ని ఉల్లంఘించిన వారి పైన ఏం చర్యలు తీసుకోవచ్చన్న విషయం అదే చట్టంలో ఉందని, ఒకవేళ తాను ఉల్లంఘించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం తన పైన ఆ మేరకు చర్యలు తీసుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో స్పష్టం చేశారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ తదితరులతో బుధవారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మునిగిపోయిన తెలంగాణ విద్యార్థుల తరఫున వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల వంతున మొత్తం రూ.1.25 కోట్ల పరిహారం మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

తెలంగాణలో విద్యుత్ సమస్యకు తానే కారణమని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చేస్తున్న ఆరోపణల పైన ఈ సందర్భంగా చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలకు విద్యుత్ సహా అన్ని పంపకాలు ఎలా జరగాలో చట్టంలో స్పష్టంగా ఉందని చెప్పారు. చట్టం ప్రకారం వాటికి తాను సహకరిస్తున్నానని తెలిపారు.
సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన తెరాస ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు పైన లేనిపోని ఆరోపణలు చేస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సందర్భంగా చెప్పారు.
ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలుగా ఏపీలో కలిసిన ఏడు మండలాల కోసం ప్రత్యేకంగా ఆర్డీఓ, ఏటీడీఏ కార్యాలయాలను భద్రాచలం సమీపంలోని ఏపీ భూభాగంలో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications