జగన్ పార్టీ సమైక్య శంఖారావం బస్సులపై రాళ్ల దాడి

పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు బస్సులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో బస్సుల్లోని ప్రయాణికులను కిందకు దింపిన పోలీసులు వారిని కాలినడకన కాజీపేటకు పంపించారు. అక్కడి నుంచి బస్సుల్లోకి ఎక్కించి హైదరాబాద్‌కు పంపించారు.
ఇంకా పలుచోట్ల తెలంగాణవాదులు బస్సులను అడ్డుకున్నారు. భారీ వర్షాల వల్ల వాగులు పొంగి పొర్లుతుండటంతో ఆంధ్రా ప్రాంతం నుంచి శంఖారావంకు వచ్చిన బస్సులను ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా మళ్లించారు. కడిపికొండ వద్ద చేసిన దాడిలో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి.
వర్ధన్నపేట - స్టేషన్ ఘనపూర్‌ల మధ్య తెలంగాణవాదులు సమైక్య సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. రెండు గంటల పాటు బస్సులను ముందుకు కదలనివ్వలేదు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా తగ్గలేదు. దీంతో బస్సులను వెనక్కి మళ్లించి తిరిగి వరంగల్ మీదుగా హైదరాబాదుకు పంపించారు.
జనగామ - సూర్యాపేట రోడ్డులో దేవరప్పుల తదితర ప్రాంతాల్లో కూడా తెలంగాణవాదులు బస్సులు వెళ్తుండగా ఆందోళన చేశారు. మరోవైపు సమైక్య శంఖారావం సభకు వ్యతిరకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళన చేశారు. ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభించిన బైక్ ర్యాలీని ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇరవవర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.












Click it and Unblock the Notifications