ఎన్నికలకు 6 నెలల ముందు... చంద్రబాబు భారీ స్కెచ్?
వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వాటిని ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. కచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాల్సిన ఎన్నికలు కావడంతో తన శైలికి భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. వైసీపీని ఎదుర్కొనే అంశంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు.

ఏ అంశాన్ని ప్రజలు మరిచిపోకూడదు
ఇప్పటికే జనసేనతో పొత్తు ఖరారైందని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ వార్తలు వస్తుండగా కలిసివచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు సాగాలని చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసిరావాలంటూ పిలుపునిచ్చారు. సీపీఐ కూడా తన అంగీకారాన్ని తెలియజేసింది. రాష్ట్రంలో ఏదైనా ఒక ముఖ్యమైన సంఘటన చోటుచేసుకుంటే దాన్ని మరిచిపోయేలా అధికార పార్టీ మరో అంశాన్ని తెరపైకి తెస్తోందని చంద్రబాబు తన ప్రసంగాల్లో చెబుతున్నారు. ఇలా కాకుండా వైసీపీ ప్రభుత్వంలో జరిగినవన్నీ ప్రజలకు గుర్తుచేయాలని, వారు మరిచిపోకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికలు ఎదుర్కోబోయే సమయం వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలకమైన పరిణామాలపై వీడియోలను రూపొందిస్తున్నారు.

తక్కువ వ్యవధితో రూపొందుతున్న వీడియోలు
ప్రతి అంశంపై తక్కువ వ్యవధితో వీడియోలు తయారు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్న ఐటీ విభాగం దీనిపై కసరత్తులు చేస్తోంది. ఇలా తయారుచేసిన వీడియోలన్నింటినీ ఎన్నికలకు ఆరునెలల ముందుగా సోషల్ మీడియాలో ఉధృతంగా విడుదల చేయబోతున్నారు. ఉదాహరణకు అమరావతి ఉద్యమం, ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై పోలీసుల లాఠీఛార్జి, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై దాడి.. దసపల్లా భూముల వ్యవహారం... సభలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసిన కామెంట్లు.. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో.. ఇలా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన కీలకమైన పరిణామాల జాబితాను సిద్ధం చేస్తున్నారు.

జరిగినవాటిని ప్రజలకు గుర్తుచేయడంద్వారా..
వీటిని పదే పదే ప్రజలకు గుర్తుచేయడంద్వారా వైసీపీపై పైచేయి సాధించవచ్చనేది చంద్రబాబు యోచన. వీటికి సంబంధించి రెండు మూడు రకాల టైటిల్స్ అనుకుంటున్నారు. ఫైనల్ గా అనుకున్న టైటిల్ తో వీడియోలు విడుదలవుతాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, భారీ ఎత్తున దొరుకుతున్న గంజాయి, అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్న ప్రజా ప్రతినిధులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు... ఇలా ప్రజలు మరిచిపోయిన అన్ని సంగతులను వ్యూహాత్మకంగా ప్రజల ముందుకు టీడీపీ తేబోతోంది. జరిగిన విషయాలను ప్రజలు మరిచిపోకూడదని, వీటిని చివరి నిముషంలో గుర్తుచేసినా చాలు.. ఓట్లు టీడీపీవైపు మళ్లుతాయని చంద్రబాబు వ్యూహం రచించారు. ఏదేమైనప్పటికీ అవి విడుదలైన తర్వాత ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టే ఏ నిర్ణయమైన ఆధారపడివుంటుంది.!!












Click it and Unblock the Notifications