కీలక జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఖరారు?
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమున్నప్పటికీ అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. పనిచేయనివారికి టికెట్ ఇచ్చేది లేదని, ఎటువంటి మొహమాటాలు ఉండవని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. చంద్రబాబును కుప్పంలో ఓడించడానికి వైసీపీ ప్రయత్నిస్తుండగా, వైసీపీని రాయలసీమలో ఓడించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
వేళ్లమీద లెక్క పెట్టేంత : 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాయలసీమలో కేవలం వేళ్లమీద లెక్కపెట్టగలిగేంద సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. సీమలో వైసీపీ ఆధిపత్యాన్ని ఎంత తగ్గిస్తే అధికారం అంత దగ్గరవుతుందని బాబు తలపోస్తున్నారు. అందుకనుగుణంగా ఆయన తన వ్యూహాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి కడపలో గత ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే పదింటినీ వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి కడప జిల్లాలో సగానికి సగం 5 నియోజకవర్గాలను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని టీడీపీ నిర్ధేశించుకుంది.

ముఖ్యమంత్రి సొంత జిల్లాపై : కడప జిల్లాలో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీచేయనున్నారు. ఎంత వీలైతే అంత మెజారిటీని తగ్గించాలని చూస్తోంది. మైదుకూరు నుంచి పోటీచేయడానికి పుట్టా సుధాకర్ యాదవ్ సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సైతం మైదుకూరు సీటు కోసం పోటీలో నిలిచారు. కమలాపురం నియోజకవర్గం నుంచి పుత్తా నరసింహారెడ్డి ఉండగా వీరశివారెడ్డి కూడా సీటు కోసం పోటీపడుతున్నారు.
తాత్సార ధోరణి వద్దంటున్న తమ్ముళ్లు : ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉండగా లింగారెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారు. కడప పట్టణంలో అమీర్ పనిచేసుకుంటున్నారు. జమ్మలమడుగు లో భూపేష్ రెడ్డి పోటీచేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. రైల్వే కోడూరు నుంచి నరసింహ ప్రసాద్, రాయచోటి నుంచి రమేష్ రెడ్డి, రాజంపేట నుంచి చెంగల్రాయుడు పనిచేసుకుంటున్నారు. బద్వేలు విషయంలో అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు.

జిల్లావ్యాప్తంగా పోటీచేయడానికి నాయకులంతా సిద్ధంగా ఉన్నప్పటికీ తాత్సార ధోరణి అవలంబించకుండా ముందుగానే ప్రకటించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఇద్దరు, ముగ్గురు పోటీపడే నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడంవల్ల అసమ్మతివాదులను బుజ్జగించడానికి సమయం ఉంటుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications