ఆ జిల్లాలో 4 సీట్లు గెలిస్తే చాలు.. అధికారం టీడీపీదే!
ఎన్నికల సమరాంగణంలో ప్రత్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. మాటల తూటాలు పేలుతున్నాయి.. విమర్శలు పదునెక్కాయి.. పోలింగ్ సమయం దగ్గరపడే కొద్దీ ఉద్రిక్తత పెరుగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ జీవన్మరణ సమస్యగా పోరాడుతున్నాయి. కచ్చితంగా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో వైసీపీ ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఇలా ఉన్న తరుణంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నేతలు సెంటిమెంట్ ను నమ్ముకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.
వ్యూహాత్మకంగా చంద్రబాబు
తెలుగుదేశం పార్టీకి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు స్థానాలనే గెలుచుకుంది. పత్తికొండ, బనగానపల్లె, ఎమ్మిగనూరులో జెండా ఎగరేసింది.

మిగతా 11 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలను వైసీపీ గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కర్నూలు జిల్లాలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.
వైసీపీ బలాన్ని తగ్గించాలని
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనీసం నాలుగు నియోజకవర్గాల్లో పసుపు జెండా రెపరెపలాడినా చాలు.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందనేది చంద్రబాబు నమ్మకం. ఏ పార్టీకి నాలుగు కంటే ఎక్కువ స్థానాలు వస్తాయో ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలకు 1990 నుంచి వస్తున్న సెంటిమెంట్ ఇది. 2014 ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు వచ్చాయికానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
మూడువారాల వ్యవధిలో చంద్రబాబు ఐదుసార్లు కర్నూలు జిల్లాలో పర్యటించారు. యువగళం పేరుతో నారా లోకేష్ నాలుగుసార్లు పర్యటించగా, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం జిల్లాలో మూడురోజులు పర్యటించారు. దీన్నిబట్టి చంద్రబాబునాయుడు కర్నూలుపై గట్టిగా దృష్టిపెట్టారని, ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను గెలుచుకోగలిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లేనని చంద్రబాబు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications