తెలుగుదేశం పార్టీలో ఈ జిల్లా నేతల రాజకీయమే వేరబ్బా!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా రాజకీయం వేరు. అందులోను తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నేతల తీరు మరికాస్త వేరుగా ఉంటుంది. వీరిలో ఎవరికీ ఒకరంటే ఒకరికి పొసగదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల నేతలు ఎవరికివారే యమునాతీరు అన్నట్లుగా ఉంటారు. ఏ ఇద్దరు నేతలు ఐకమత్యంగా అన్నదే ఇక్కడ వినిపించదు. సొంత పార్టీకి చెందిన నేత, నాలుగుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన వ్యక్తిపై అధికార పార్టీ నాయకులు దాడిచేస్తే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదని అధినేతే ఆవేదన వ్యక్తం చేశారంటే వీరిలో ఐకమత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సొంత పార్టీ నేతలపైనే ఎక్కువ విమర్శలు
విజయవాడ కేంద్రంగా కృష్ణా జిల్లా టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తుంటారు. ప్రత్యర్థులపై గళమెత్తమంటే తీవ్రస్థాయిలో తమ వాణిని సొంత పార్టీ నేతలపై వినిపిస్తారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, వర్ల రామయ్య, బొండా ఉమ, బుద్ధా వెంకన్న కేంద్రంగా పార్టీ రాజకీయాలు కొనసాగుతుంటాయి. కేశినేని నాని తరుచుగా సొంత పార్టీ నేతలపై గర్జిస్తుంటారు. కొన్నాళ్లుగా ఆయన టీడీపీలో ఉన్నారో, బీజేపీలో ఉన్నారో అర్థం కాకుండా ఉంటుంది. ఇతర నేతంతా ఎవరినీ కలుపుకుపోకుండా ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తుంటారు.

మినీ మహానాడునే నిర్వహించలేకపోతున్నారు?
గుడివాడ కేంద్రంగా మినీ మహానాడు నిర్వహించడానికి కూడా వీరు సమన్వయం చేసుకోలేకపోతున్నారు. మినీ మహానాడు గుడివాడలో నిర్వహించాలనుకున్న చంద్రబాబు బాధ్యతలను ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు అప్పజెప్పారు. దాదాపు నెలన్నర సమయం గడుస్తున్నప్పటికీ పార్టీ అక్కడ మినీ మహానాడును నిర్వహించలేకపోతోంది. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని అక్కడ తెలుగు మహిళలు ముట్టడించారు. ఆ మాత్రం పోరాట పటిమ కూడా చూపలేకపోతున్నారంటూ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహచర నేతకన్ను పొడిచేసినా వారు ఇంతవరకు స్పందించలేదని, ఇలా అయితే పార్టీలో ఉండవద్దని తేల్చిచెప్పారు.

పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజే ముఖ్యం?
కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలకు పార్టీ ఇమేజ్ కన్నా వారి వ్యక్తిగత ఇమేజే ముఖ్యం. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావడంలో జిల్లా నేతలదే ముఖ్యపాత్ర. వైసీపీని ఓడించే బదులు వీరిలో వీరిని ఓడించుకోవడానికే పనిచేశారంటూ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. బాబు వీరితో గతంలో అనేక సమావేశాలను ఏర్పాటు చేశారని, కానీ ఇక్కడి నాయకుల్లో వీసమెత్తు కూడా మార్పురాలేదని, తాము పార్టీ కోసం కష్టపడటానికి 24 గంటలు సిద్ధంగా ఉంటున్నప్పటికీ జిల్లా నేతల మధ్య సమన్వయం కొరవడిందని వాపోతున్నారు. ఇప్పుడైన చంద్రబాబు కఠినచర్యలు తీసుకుంటేనే జిల్లాలో పార్టీ బాగుపడుతుందని, లేదంటే మరోసారి ఇక్కడి సీట్లను వైసీపీకి అప్పజెప్పడానికి సిద్ధమవ్వాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications