వైసీపీ అనూహ్య దాడితో తెలుగుదేశం పార్టీకి షాక్?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య దాడితో తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్‌లోకి వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రవేశించడంతో లోకేష్ మధ్యలోనే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ అలా వెళ్లిపోవడాన్ని తెలుగుదేశం పార్టీ పరాభావంగా భావిస్తోంది. జూమ్ కాన్ఫరెన్స్ లో చొరబడటం అనేది ఇంతటితో ఆగిపోయేది కాదని, కేవలం ఇది ఆరంభం మాత్రమేనని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని హెచ్చరించారు.
జూమ్ కాన్ఫరెన్స్ ల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీపై తప్పుడు ప్రచారం చేపడుతున్నారని భావించిన వైసీపీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. అందులో భాగమే వంశీ, కొడాలి నాని రంగప్రవేశం. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జూమ్ కాన్ఫరెన్స్ ల్లోకి వైసీపీ ముఖ్యనాయకులు వెళ్లబోతున్నారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

తప్పుడు ఐడీలతో కొడాలి నాని, వంశీలు జూమ్ మీటింగ్ లోకి రావడంపై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. విద్యార్థులు ఫెయిలవడం అనేది ప్రభుత్వం చేతిలో లేదని, కరోనా, ఇతర కారణాలవల్ల ఫెయిలై ఉంటారన్నారు. తాను కూడా ఇంటర్ ఫెయిలయ్యానన్నారు. విద్యకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, దాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకున్నామన్నారు.
గతంలోలాగా తెలుగుదేశం పార్టీ జూమ్ మీటింగ్ లు నిర్వహిస్తే చెల్లవని తాము చొరబడి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ భవిష్యత్తు నిర్ణయం స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకనుంచి తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు వెళుతుందా? వైసీపీ దాన్ని అడ్డుకుంటుందా? అనేది తెలియాలంటే కొన్నిరోజులు వేచిచూడక తప్పదు..












Click it and Unblock the Notifications