ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహన్ రావు కన్నుమూత
కాకినాడ: ప్రముఖ తెలుగు కవి అద్దేపల్లి రామ్మోహనరావు (80) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 6న కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చింతగుంటపాలెం గ్రామంలో రామ్మోహన రావు జన్మించారు.
ఆయన 40కి పైగా గ్రంథాలను రచించారు. తెలుగులో మినీ కవిత్వాన్ని రామ్మోహనరావు ప్రోత్సహించారు. 2001లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. రామ్మోహనరావు మృతి పట్ల వరవరరావు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
అద్దేపల్లి రామ్మోహన్‌రావు అంతర్జ్వాల, మధుజ్వాల, రక్తసంధ్య, గోదావరి నా ప్రతిబింబం, మెరుపు పువ్వు, పొగచూరిన ఆకాశం వంటి కవితా సంకలనాలను వెలువరించారు. శ్రీశ్రీ కవితా ప్రస్థానం, విమర్శ వేదిక, సాహిత్య సమీక్ష, జాషువా కవితా సమీక్ష, దృష్టి వంటి తెలుగు సాహిత్య విమర్శనా గ్రంథాలను ఆయన వెలువరించారు.

ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గొంతెత్తిన తెలుగు కవుల్లో ఆయన ఒకరు. ఆయనను బోయి బీమన్న అవార్డు, తిలక్ పురస్కారం, తమిళనాడు చిన్నప్ప భారతి అవార్డు, నాగభైరవ అవార్డులు వరించాయి. ఆయన 25కు పైగా కవితా సంకలనాలు వెలువరించారు.
అద్దేపల్లి కాకినాడ ఎమ్‌ఎస్‌ఎన్ ఛారిటీస్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు. రామ్మోహన్‌రావుకు నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో అద్దేపల్లి ప్రభు కూడా రచయితగా మంచి గుర్తింపు పొందారు.












Click it and Unblock the Notifications