ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె రాసిన విముక్త కథల సంపుటికి గాను ఈ అవార్డు లభించింది. ఓల్గా అసలు పేరు పోపూరి లలితకుమారి. సాహిత్యంలో స్త్రీవాద దృక్పథాన్ని నిలబెట్టిన అగ్రశ్రేణి రచయిత్రుల్లో ఓల్గా ఒకరు.
ఓల్గా 1950 నవంబర్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో జన్మించారు. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎ చేసి తర్వాత తెనాలిలోని విఎస్ఆర్ కళాశాలలో తెలుగు అధ్యపకురాలిగా పనిచేశారు. ఓల్గా కథలు మాత్రమే కాకుండా నవలలు కూడా రాశారు.
చలన చిత్ర రంగంలో కూడా ఆమె పనిచేశారు. ఉషాకిరణ్ సంస్థకు కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలను నిర్మించి పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆమె రాసిన స్వేచ్ఛ నవల వివిధ భారతీయ భాషల్లోకి అనువాదం కానుంది.

ఆమె 1991 నుంచి 1997 వరకు ఆస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె ప్రస్తుతం అస్మితలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె 1990లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందుకున్నారు. 2014లో లోక్ నాయకు ఫౌండేషన్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు.
రాజకీయ కథలు, స్వేచ్ఛ, సహజ, ప్రయోగం, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, గులాబీలు, ఆకాశంలో సంగం, పలికించకు మౌనమృదంగాలు, అలజడి మా జీవితం వంటి పలు రచనలు చేశారు. మాకు గోడలు లేవు, నూరేళ్ల చలం వంటి రచనలకు ఆమె సంపాదకత్వం వహించారు.












Click it and Unblock the Notifications