ఖాకీలపై తెలుగు యువత అధ్యక్షుడి పిడిగుద్దులు: అరెస్ట్ చేసిన పోలీసులు
అమరావతి: అధికార పార్టీకి చెందిన నేతలు అప్పుడప్పుడు పోలీసులపై ప్రతాపం చూపిస్తుంటారు. తాజాగా ఏపీలో టీడీపీ యువజన విభాగం తెలుగు యువతకు చెందిన ఓ నేత పోలీసులని కూడా చూడకుండా వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. సొంత పార్టీకి చెందిన నేతపై దాడిని అడ్డుకోవడమే ఇక్కడ పోలీసులు చేసిన నేరం.
వివరాల్లోకి వెళితే... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పాకాల మండలం తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిశోర్ నాయుడు, పాకాల ఎంపీటీసీ గౌతమి భర్త రమేశ్‌లు వారి అనుచరులతో కలిసి, ఎంపీపీ చాముండేశ్వరి అనుచరులపై దాడికి దిగారు.
ఈ దాడిని గమనించిన పాకాల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైలుగా పనిచేస్తున్న రవీంద్రనాథ్, శ్యామ్ బాబు, కానిస్టేబుల్ హనీఫ్ బాషా గొడవను అదుపు చేసేందుకు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఏఎస్సైలు దాడికి పాల్పడకుండా వారిని అడ్డుకున్నారు. దీంతో తమనే అడ్డుకుంటారా? అంటూ కిశోర్ నాయుడు, రమేశ్‌లు ఇద్దరు ఏఎస్సైలు, కానిస్టేబుళ్లపై పిడిగుద్దుల కురిపించారు.

అంతేకాదు ఘర్షణను రికార్డు చేసేందుకు పోలీసులు వినియోగించిన ట్యాబ్, సెల్ ఫోన్లను సైతం ధ్వంసం చేసి అక్కడ నుంచి పరారయ్యారు. కిశోర్ నాయుడు దౌర్జన్యంపై కానిస్టేబుల్ హనీఫ్ బాషా చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పాకాల పోలీసులు కిశోర్ నాయుడు, రమేశ్‌లు సహా మొత్తం ఆరుగురిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు.
ఆ తర్వాత పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆదివారం సాయంత్రం తెలుగు యువత అధ్యక్షుడు కిశోర్ నాయుడు, ఎంపీటీసీ గౌతమి భర్త రమేశ్‌లను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications