లోకేష్ సవాల్, కేసీఆర్ కాదని మంత్రి, సానియాపై రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారనే విషయమై బాబుతో చర్చించేందుకు కేసీఆర్ సిద్దమా అని ట్వీట్ చేశారు.
తెలంగాణలో విద్యుత్ కొరత ఎందుకుందని ప్రశ్నించారు. హైదరాబాదు బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు నాశనమవుతోందని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
లోకేష్ సవాల్ స్వీకరించిన జగదీశ్వర్ రెడ్డి
నారా లోకేష్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. చంద్రబాబుతో చర్చించేందుకు తమ ముఖ్యమంత్రి కేసీఆరే అక్కర్లేదన్నారు. ప్రభుత్వంలోని మంత్రులం అందరం బాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
అదే సమయంలో ఆయన కాంగ్రెసు పార్టీ నేతల పైన కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు భరోసా యాత్రలు చేయడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేసేది రైతు భరోసా యాత్ర కాదన్నారు. పదేళ్ల వారి పాలనలో చేసిన అవినీతి పైన విచారణ చేపడితే తెలంగాణలోని జైళ్లు సరిపోవన్నారు.
బస్సు యాత్రతో ప్రభుత్వానికి చెమటలు: ఎర్రబెల్లి
టీడీపీ బస్సు యాత్రతో ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయని అందుకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బస్సయాత్రను అడ్డుకోవాలని చూశారని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఆరోపించారు. దమ్ముంటే అఖిలపక్ష సమావేశం పెట్టాలని, తెరాస వేసిన 22 ప్రశ్నలకు సమాధానం చెబుతామన్నారు.

తెలుగుదేశం
ప్రజల కష్టాలు పట్టించుకునే తీరక తెరాస ప్రభుత్వానికి లేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కేబినెట్లో ఒక్క మహిళ కూడా లేదన్నారు.

తెలుగుదేశం
కేసీఆర్ కుటుంబ అనుమతి లేనిదే మంత్రులు ఏ దస్త్రం పైన సంతకం పెట్టే అవకాశం లేదని ఆరోపించారు. నల్గొండ జిల్లా బస్సుయాత్ర సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు మాట్లాడారు.

తెలుగుదేశం
చంద్రబాబును తిడుతూ కూర్చుంటే కరెంటు రాదని, చేతకాకపోతే అధికారం నుండి తప్పుకోవాలని ఎర్రబెల్లి అన్నారు. కరవులో కూడా చంద్రబాబు 9 గంటల విద్యుత్ ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

తెలుగుదేశం
విద్యుత్ కోతల పైన అఖిల పక్షం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులు అదైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఎర్రబెల్లి సూచించారు.

తెలుగుదేశం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శుక్రవారం నల్గొండ జిల్లాలో బస్సుయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. వారు తమ యాత్రలో తెరాస పైన, కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు.
ప్రజలు, రైతులు తమ వెంట ఉన్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్ అసమర్థతతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు నల్గొండ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బస్సు యాత్ర ప్రారంభమైంది. టీ-టీడీపీ నేతలు చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. విద్యుత్ కోతల వల్ల సాగు నీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధలు చూసైనా ప్రభుత్వం స్పందించాలని ఎర్రబెల్లి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆందోళనలో ఉన్నారని టీటీడీపీ నేత ఎల్.రమణ అన్నారు. శుక్రవారం ఉదయం టీటీడీపీ బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నిర్లక్ష్యం, అసమర్థత రైతుల పాలిట శాపంగా మారిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీ ప్రభుత్వం 2016 వరకు విద్యుత్ కొనుగోలు చేస్తోందన్న రమణ కరెంట్ విషయంలో టి. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. మొదటి విడదతలో నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఎల్.రమణ తెలిపారు.
బతుకమ్మ పండుగ కోసం కేసీఆర్ తన కుమార్తెకు రూ.10 కోట్లు, సానియా మీర్జాకు రూ.2 కోట్లు ఇవ్వడం కాదని, రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. బస్సు యాత్రలో టీడీపీ తెలంగాణ చీఫ్ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఉమామాధవ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డీజిల్ కొరత పైన రాజయ్య
108 వాహనాలకు ఇప్పుడు డీజిల్ కొరత సమస్య తీరిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య తెలిపారు. 108 సర్వీసులు యధావిధిగా ఉంటాయని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications