Video: చేయని నేరానికి పోలీసుల టార్చర్.. మహిళ 'సెల్ఫీ' సూసైడ్!
చేయని నేరానికి పోలీసులు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారంటూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో తీవ్ర కలకలం రేపింది. ఒక తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనను వేధించడమే ఈ ఘోరానికి కారణమని తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం గడ్డి మందు తాగిన ఆమె, గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (GGH)లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.
పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతమ్మ అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితం తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన భర్తతో కలిసి వాచ్‌మెన్‌గా పనిచేసేది. అయితే, ఆ అపార్ట్‌మెంట్ ప్లాట్‌లో ఉండే ఒక మహిళ.. తిరుపతమ్మకు తాను బంగారం ఇచ్చానంటూ తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో బంగారం రికవరీ చేయాలనే నెపంతో వన్‌టౌన్ పోలీసులు తిరుపతమ్మను స్టేషన్‌కు పిలిపించారు.

పోలీసుల వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో!
తాను ఎలాంటి తప్పు చేయలేదని, బంగారం తీసుకోలేదని మొత్తుకున్నా పోలీసులు వినకుండా తీవ్రంగా వేధించారని తిరుపతమ్మ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకుంది.
మేము చేయని నేరానికి మమ్మల్ని కావాలనే ఇరికించారు. పోలీసుల ద్వారా మిమ్మల్ని కొట్టించారు. అసలు మేము ఏ నేరం చేయలేదు. ఆమె బంగారం ఆమెకి విడిపించి ఇచ్చాం. అయినా కానీ మేము చెప్పింది ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు మమ్మల్ని ఆదరించే వాళ్లు, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్లే లేరు. పోలీసులంతా వాళ్ల మాటే వింటున్నారు. సామాన్యుల మాట పోలీసుల కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము బతకాలనుకోవడం లేదు. మా పరువు తీసిందే కాక ఆమె మాపే నిందలేసింది. నేరాన్ని అంగీకరించాలని నిన్న పొద్దున నుంచి కొడుతూనే ఉన్నారు పోలీసులు. ఏం చేయాలో మాకు అర్ధం కాలేదు. ఆ దెబ్బలు తట్టుకోలేక బంగారం తీసుకెళ్లినట్లు ఒప్పుకున్నాం. ఒప్పుకున్నందుకు అప్పుడు వదిలేశారు మమ్మల్ని. ఈ పూట మళ్లీ రమ్మన్నారు. మాకు తన్నులు తినే ఓపిక లేదండి ఇంక. మేము చేయని తప్పును వాళ్లు బలవంతంగా కొట్టైనా చేయాలని వాళ్లు అనుకుంటున్నారు. మేము చేయని నేరాన్ని చేశామని ఒప్పుకోలేము. మాకు ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే మావైపు ఏ పెద్దవాళ్లు లేరు. మేము మాట్లాడిన పెద్ద వాళ్లు కూడా వాళ్ల పక్షానే మాట్లాడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నింద మాపై మోపారు. ఆమె చేసిన తప్పులన్నీ నా మీద వేసి వాళ్ల భర్త దగ్గర తప్పుకోవాలనుకుంది. ఆమె బంగారం తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చి వడ్డీకి తిప్పిద్ది. వాళ్ల అమ్మకు బ్రోతల్ హాస్ వాళ్లతో సంబంధాలున్నాయి. ఇవన్నీ నేను బయటపెడతాననే అనుమానంతో వాళ్ల మొగుడికి నాపై లేనిపోనివన్నీ చెప్పి.. ఇరికించారు. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి. ఈ వీడియో మీకు చెరే సమయానికి మేము ప్రాణాలతో ఉండం. ఎస్సై దుర్భాషలాడారు. ఆ ఉద్యోగంలో ఉండి ఆడవాళ్లతో అలా మాట్లాడవచ్చా. డబ్బున్న వాళ్లుకున్న విలువ పేదోళ్లకి లేదు. ఆమెకి వాళ్ల మరిదికి ఆఫైర్ ఉంది. అయినా కానీ ఆ విషయాన్ని నేను బయటపెట్టలేదు. ఆమెకి గుంటూరులో కూడా ఒకయాన ఉన్నాడు. ఆయన దగ్గరకి కూడా వెళ్లిద్ది. కానీ ఇవేం నేను వాళ్ల కాపురం పోతుందని బయటపెట్టలేదు. ఈ రోజు మా పరువు తీసి, మమ్మల్ని ఇంతలా కొట్టిన తర్వాత నేను బయటపెట్టాను. మాకు చావుకు న్యాయం జరగాలి కలెక్టర్ గారు - తిరుపతమ్మ.
తెనాలిలో సంచలనం రేపుతున్న మహిళ ఆత్మహత్య
— oneindiatelugu (@oneindiatelugu) May 24, 2026
కేసు విచారణ పేరుతో పోలీసుల వేధింపులే కారణమంటూ తిరుపతమ్మ సెల్ఫీ సూసైడ్!#Women #Tenali #AndhraPradesh #ViralWatch #OITelugu pic.twitter.com/9TjKaGsZap
చేయని నేరానికి సమాజంలో తలదించుకోవాల్సి రావడం, పోలీసుల ఒత్తిడిని తట్టుకోలేక ఆమె శనివారం గడ్డి మందు (పురుగుల మందు) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో తిరుపతమ్మ ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఒక సామాన్య మహిళ పోలీసుల వేధింపుల వల్లే ప్రాణాలు కోల్పోయిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications