ఆంధ్రా-కర్నాటక సరిహద్దులో ఉద్రిక్తత: ఆంధ్రా రైతుల ఆందోళన
అనంతపురం: ఆంధ్రప్రదేశ్, కర్నాటక సరిహద్దుల్లో ఆదివారం నాడు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. స్వర్ణ ముఖి నది పైన ఆనకట్టను తొలగిస్తామని కర్నాటక రాష్ట్రానికి చెందిన సరిహద్దు రైతులు హెచ్చరించారు. దీంతో, అనంతపురంలోని ఏపీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా నీరు ఏపీ వాడుకుంటోందని, ఇది సరికాదని కర్నాటక రైతులు విమర్శిస్తున్నారు. తాము ఆనకట్టను తొలగిస్తామని కర్నాటక రైతులు చెప్పారు. కర్నాటక రైతులు సంఘటన స్థలానికి వస్తున్నారు. అనంత రైతులు కూడా వెళ్తున్నారు. దీంతో, ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు.
రంగాపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో శనివారం అర్థరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఐదుగురికి గాయాలైనట్లు ఎస్సై తెలిపారు. ఒక వర్గానికి చెందిన వారి వారి కుక్క మరో వర్గం వారి ఇంటి ముందుకు వచ్చిందనే విషయంపై ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి.
ఈ ఘటనలో లక్ష్మారప్ప వర్గంలోని రామలింగ, లక్ష్మారప్పకు గాయాలు కాగా, మరో వర్గంలో పెద్ద పకీరప్ప, చిన్న పకీరప్ప, తల్లి ఈరమ్మకి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.












Click it and Unblock the Notifications