ఖరారు: ఏపీ నుంచి రాజ్యసభకు టీడీపీ అభ్యర్ధులు వీరే
అమరావతి: పెద్దల సభగా భావించే రాజ్యసభలో అడుగుపెట్టాలని ఆశిస్తున్న టీడీపీ నేతల సంఖ్య పెరిగిపోతున్న సమయంలో ముగ్గురు పేర్లను ముఖ్యమంత్రి, పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సోమవారంనాడు ఖరారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీలో నాలుగు సీట్లు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి వీటిలో మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి, మరో సీటు వైసీపీకి దక్కనున్నాయి.
అయితే వైసీపీకి దక్కనున్న ఒక్క సీటుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అభ్యర్ధిత్వాన్ని వైయస్ జగన్ ఖరారు చేయడంతో నామినేషన్ కూడా దాఖలు చేశారు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో, టీడీపీ తన అభ్యర్ధులను ఖరారు చేసింది.
టీడీపీకి దక్కే మూడు సీట్లలో మిత్ర ధర్మంలో భాగంగా ఒక సీటుని బీజేపీకి కేటాయించింది. కేంద్రం రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని బీజేపీ పెద్దలు కోరగా అందుకు చంద్రబాబు అంగీకరించారు. ఇక మిగిలిన రెండు సీట్లలో టీడీపీ తరుపున రాజ్యసభ అభ్యర్ధులుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లను ఖరారు చేసింది.
కేంద్ర మంత్రి సుజానా చౌదరి, మాజీ మంత్రి జేఆర్ పుప్షరాజ్, రాయలసీమకు చెందిన టీజీ వెంకటేశ్‌లతో పాటు తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు కూడా రాజ్యసభ సీట్ల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరకు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ పేర్లనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న 2014లో టీడీపీలో టీజీ చేరినా ఇప్పటి వరకు ఎలాంటి పదవి చేపట్టలేదు. అయితే, సోమవారం కర్నూలు నుంచి విజయవాడకు వచ్చిన టీజీ వెంకటేశ్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.
రాజ్యసభకు తనను పంపాలని ఆయన అధినేతను కోరారు. దీంతో ఆయనకు రాజ్యసభ సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక రాజ్యసభ రేసులో నాల్గవ అభ్యర్ధిని పెట్టాలా వద్దా? అనే విషయమై ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications