తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద నేటికీ ఆ గునపం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 68,427 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,066 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.81 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

శ్రీవైష్ణవ భక్తుడు శ్రీ అనంతాళ్వారు 971వ అవతారోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటలకు ఈ సదస్సు ప్రారంభమౌతుంది.
అనంతళ్వార్ తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తారు. దీన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా స్థిరపడిన అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శ్రీ అనంతాళ్వారును సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా ఆరాధిస్తారు. రామానుజాచార్యుని కోరిక మేరకు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణాల్లో ఉంది. పుష్ప కైంకర్యాల కోసం అనంతాళ్వారు స్వామివారి ఆలయం వద్ద తోటను ఏర్పాటు చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
తోటను ఏర్పాటు చేస్తోన్న సమయంలో బాలుడి రూపంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షం అయ్యాడని, అనంతాళ్వారు ఆ బాలుడిపై గునపాన్ని విసరగా.. స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం రావడం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపంతో ఆ గాయానికి కర్పూరాన్ని అంటించాడని విశ్వసిస్తారు.
నేటికీ శ్రీవారి మూలవిరాట్టు చుబుకానికి కర్పూరాన్ని అంటించడం ఆనవాయితీగా వస్తోంది. నేటికీ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఆ గునపం భక్తులకు దర్శనం ఇస్తోంది.












Click it and Unblock the Notifications