తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు - మూడు రోజులు సేవలు రద్దు..!!
Tirumala:ప్రసిద్ధ పుణ్యకేత్రమైన తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 5 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నాడు మొదలై మూడు రోజుల పాటు అంటే పౌర్ణమి నాడు వరకూ ఈ వసంతోత్సవాలు జరుగుతాయి. వసంతోత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అటు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 5న కళ్యాణం నిర్వహించనున్నారు.
తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున శ్రీదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారుని ఆలయ నాలుగు మాడ వీధిలో ఊరేగించారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. వసంతోత్సవ అభిషేక నివేదన పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనే, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు.

వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియని అధికారులు వెల్లడించారు.
ఈ నెల 5వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం,ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications