తిరుమలలో అత్యంత అరుదైన ఉత్సవం- ఏడాదికోసారే
Tirumala: వరుస సెలవులు, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 63,539 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,144 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.
నేడు కైశిక ద్వాదశి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరుమాడ వీధుల్లో ఊరేగారు. శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులను కరుణించారు. ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగ్ర శ్రీనివాసుడిని వేంకటతురైవార్, స్నపనబేరంగా కొలుస్తారు భక్తులు.

సూర్యోదయానికి ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. సూర్యోదయానికి ముందే ఈ ఊరేగింపును ముగించడానికి కారణాలు లేకపోలేదు. 14వ శతాబ్దంలో ఊరేగింపును నిర్వహిస్తోన్న సమయంలో సూర్య కిరణాలు స్వామివారి విగ్రహం మీద పడగానే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పటి నుంచి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తూ వస్తోన్నారు. కైశిక ద్వాదశి నాడు ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు.
పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీ వరాహ స్వామి కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగాపిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది.
ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందే తెల్లవారుఝామున 4.30 నుండి 5.45 గంటల వరకు ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగించారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుండి ఉదయం 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. దీనితో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.
శ్రీమహావిష్ణువును మేల్కొలిపే పర్వదినమే కైశిక ద్వాదశి. శ్రీమహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు గాఢ నిద్రలోకి వెళ్తారు. కైశిక ద్వాదశినాడు ఆయనను మేల్కొల్పడం ఆనవాయితీ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన తిరుమలలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ఏటేటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications