ప్రభుత్వ చట్టాల చట్టబద్ధతను తేలుస్తాం - రాజధాని ఏది అనువైనదో చెప్పం : హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ రాజధాని వ్యవహారం పైన పిటీషన్లను హైకోర్టు రోజు వారీ విచారణ కొనసాగిస్తోంది. ఈ వాదనల సమయంలో అనేక అంశాలు పిటీషనర్లు ప్రస్తావిస్తున్నారు. న్యాయస్థానం సైతం స్పష్టమైన వైఖరిని చెబుతూ వస్తోంది. తాజాగా జరిగిన వాదనల్లో తాము ప్రభుత్వం జారీ చేసిన చట్టాల చట్టబద్దతనే తేలుస్తామని స్పష్టం చేసింది. ఇది నగరాల మధ్య పోటీ కాదని.. రాజధానిగా ఏ నగరం అనువైనదో చెప్పమని తేల్చి చెప్పింది. రాజధాని పిటీషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగించింది.

మెజార్టీ ప్రజలు కోరుకున్నట్లుగానే
శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులు పరిగణనలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం సరికాదని పిటీషనర్ల తరపు న్యాయవాది వాదించారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని మెజార్టీ ప్రజలు కోరుకున్నట్లు నివేదికలో ఉందంటూ కోర్టుకు నివేదించారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడం వల్ల సహజంగా ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకపోతే ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయనే వాదనను ప్రస్తుత ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందని... నిజానికి, వికేంద్రీకరణ గురించి గత ప్రభుత్వమే ఆలోచన చేసిందని తెలిపారు.

అప్పుడే నిర్ణయించారు
అమరావతితోపాటు మరో 3 మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయాలని అప్పుడే నిర్ణయించారు. ప్రస్తుత పాలన వికేంద్రీకరణ బిల్లుతో కొత్తగా చేసేది ఏమీ లేదు. రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతించారఅ తెలిపారు. నాడు జగన్ చేసిన ప్రకటనను కోర్టులో ప్రదర్శించేందుకు అనుమతించాలని కోరారు. మూడు రాజధానుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీలు అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన రైతుల వాదనలు వినలేదు. ఏకపక్షంగా నివేదికలు ఇచ్చాయి. వాటికి చట్టబద్ధత లేదని వాదించారు.

సీఆర్‌డీఏ చట్టానికి చట్టబద్ధత
సీఆర్‌డీఏ చట్టానికి చట్టబద్ధత కల్పించడంతో ఫలితం దక్కుతుందని ఆశించి భూములు ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటనతో వారి హక్కులకు భంగం కలిగింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు కలగజేసుకోవచ్చు. మూడు రాజధానుల ప్రకటనకు అధికారంలో ఉన్న పార్టీ మారిందనే ఒక్క కారణం తప్ప మరే ఇతర కారణం లేదని మరో న్యాయవాది ఉన్నం శ్రవణ్ కుమార్ వాదించారు. రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ అంతిమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిందని సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు పేర్కొన్నారు.

గడువుకంటే ముందుగానే
దాని ఆధారంగానే నాటి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిందన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి గడువుకంటే ముందుగానే హైపవర్ కమిటీ తన నివేదకను ప్రభుత్వానికి అందజేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే తొందర కనపడిందని చెప్పారు. సీఆర్‌డీఏ చట్టం చేసేటప్పుడు అప్పటి ప్రభుత్వం ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలుసుకోలేదంటూ శాసనసభ వ్యవహారాలను తప్పుబట్టే రీతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించారు.

న్యాయస్థానాలు ఆ విషయాన్ని తేలుస్తాయి
శాసనాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని చట్టసభలే పునఃసమీక్షిస్తాయి. లేదా న్యాయస్థానాలు ఆ విషయాన్ని తేలుస్తాయి. చట్టసభలు చేసిన శాసనాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యంతరం చెప్పడం సరికాదు'' అని తెలిపారు. అమరావతి భూముల కొనుగోలు విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేశారన్నారు. దీనిపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పులను సమర్ధించిందని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చిన సందర్భం దేశంలో ఇదే మొదటిసారని... దానిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆదినారాయణరావు పేర్కొన్నారు. ఈ రోజు పిటీషన్ల పైన విచారణ కొనసాగనుంది.












Click it and Unblock the Notifications