ముదురుతున్న వివాదం..! బాబు పై ముప్పేట దాడికి సిద్దమౌతున్న బీజేపి జాతీయ నేతలు..!!
అమరావతి : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాటల తూటాలకు పదునుపెంచారు బీజేపి నేతలు. నిన్నటివరకు స్థానిక నేతలు టీడిపి ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తే, ఇప్పుడు ఏకంగా జాతీయ నేతలు రంగంలోకి దిగారు. చంద్రబాబును అష్టదిగ్బంధనం చేస్తే సౌత్ ఇండియాలో తమకు ఎదురుండదనే వ్యూహంతో బీజేపీ జాతీయ నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పలాసలో బీజేపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా చంద్రబాబు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలే నిదర్శనమని అమరావతిలో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. అమిత్ షా వ్యాఖ్యలకు చంద్రబాబు సైతం ఘాటుగానే స్పందించారు.

వేడి పెంచిన అమిత్ షా ఏపి పర్యటన..! బాబును నిలువరిస్తామన్న బీజేపి..!!
ఏపీలో అమిత్ షా పర్యటన రాజకీయ వేడి పెంచింది. ‘వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం, మోదీ మళ్లీ ప్రధాని అవుతారు. చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలోకి రావడానికి ప్రయత్నిస్తారు. అయితే, మేము తలుపులు ఆయనకు మూసేశాం ' అన్న అమిత్ షా వ్యాఖ్యలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. చరిత్రను మరిచిపోయి పిచ్చి మాటలు మాట్లాడొద్దని అమిత్ షా కు గట్టి కౌంటర్ ఇచ్చారు. 2014లో ఎవరు ఎవరి దగ్గరకు వచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండని చురక వేశారు చంద్రబాబు.

అమీత్ షా వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన బాబు..! వచ్చే ఎన్నికల్లో బీజేపి ఓడిపోతుందన్న బాబు..!!
కాగా అమిత్ షా ఏపీలో బాబు ఢిల్లీలో పర్యటించారు. అమిత్ షా వ్యాఖ్యలపై బాబు ఢిల్లీ మీడియాతో మాట్లాడారు. గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని, అపుడు తిరిగి గౌరవం దక్కుతుందని చంద్రబాబు అమిత్ షా ను హెచ్చరించారు.
బీజేపీ నిరంకుశత్వానికి పాల్పడుతోందని, గత పాలకులు ఇలా వ్యవహరించి ఉంటే అసలు బీజేపీ ఉండేదా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవస్థలను నాశనం చేయడంతో పాటు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని బీజేపి జాతీయ నేతలపై బాబు మండి పడ్డారు.

బీజేపి కక్ష్య పూరిత రాజకీయాలు..! ఏపి కి ఏమిచ్చారో చెప్పాలన్న బాబు..!!
దేశ వ్యాప్తంగా సీనియర్ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారని, దేశంలో బీజేపి తప్ప ఇతర పార్టీ నాయకుడు ఉండొద్దన్నట్లు మోడీ-షాల ప్రవర్తన ఉందని బాబు ద్వజమెత్తారు. మీడియా, అధికారులు, కార్పొరేట్ నాయకులు, ఇలా అందరినీ బీజేపి ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక బీజేపి సమయం ముగిసిపోయిందని, నెలరోజుల తర్వాత మీరు ఎక్కడ ఉంటారో కూడా మీకు తెలియదని బాబు ఘాటుగా స్పందించారు.

ఎన్ని అవరోదాలలైనా అదిగమిస్తాం..! అభివ్రుద్ది సాధించి తీరుతామంటున్న చంద్రబాబు..!!
నీటి పారుదల, వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు ఇలా అన్ని విషయాల్లో ఏపీ ఎన్నడూ లేనంత అభివృద్ధి నమోదు చేసిందని గుర్తు చేసారు చంద్రబాబు. కేంద్రం లక్ష కోట్లకుపైగా ఇవ్వాలని, జేపీ నారాయణ్, పవన్ కళ్యాణ్ కమిటీలు కూడా ఇవే నిర్దారించాయని, ఆ నిధులు ఇచ్చి ఉంటే, ఏపీ ఈ పాటికి ఎంతో అభివ్రుద్ది సాధించి ఉండి ఉండేదని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ అభివ్రుద్ది చెందకూడదనే దురుద్దేశంతో నిధులు ఆపుతున్నారని కేంద్ర బీజేపి ప్రభుత్వం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మొత్తానికి అటు బీజెపి జాతీయ నేతల ఆరోపణలు, చంద్రబాబు ప్రత్యారోపణలతో ఏపి రాజకీయాలు మరింత వేడెక్కాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!